DGP Rajendranath Reddy : లోన్ యాప్ వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉండాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భరోసా ఇచ్చారు. లోన్ యాప్ ల వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తామని, బాధితులు  ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఇలాంటి కేసులను పరిష్కరించి, బాధితులకు అండగా ఉండాలని పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన వివిధ కేసులను సమీక్షించామని, చాలా వరకు నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయని డీజీపీ తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించేందుకు దిశ యాప్ పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మహిళలు తమ మొబైల్స్ లో దిశ యాప్ ను డౌన్లోడు చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.


నాటు సారాపై డీజీపీ ఏమన్నారంటే? 
 
నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలను గుర్తించి, నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తులు శాశ్వతంగా సారా వ్యాపారాలకు స్వస్తి పలికి, వేరే వృత్తులతో పునరావాసం కల్పించేందుకు గ్రామ స్థాయిలోనే సర్వేలు నిర్వహించనున్నట్లు డీజీపీ తెలిపారు. ఇందుకు  సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వం కూడా గ్రామాల్లో నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్, వివిధ స్కీమ్ లతో 3400 కుటుంబాలకు పునరావాసం కల్పించే విధంగా కృషి చేస్తుందన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం రూపొందించిన 14400 మొబైల్ యాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ యాప్ కు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే 58 కేసులు నమోదు చేశామన్నారు. లోన్ యాప్ ల మోసాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతుందన్నారు.


లోన్ యాప్ లపై కఠిన చర్యలు 


లోన్ యాప్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా అడిగే వాటన్నింటికి అనుమతులు ఇవ్వొద్దని డీజీపీ సూచించారు. రుణాలు తీసుకొనే క్రమంలో యాప్ నిర్వాహకులు అడిగిన వాటన్నింటికి అనుమతులు ఇవ్వడంతో ఫొటోలు, లొకేషన్, కాంటాక్ట్ నంబర్లు డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్లి పోతుందన్నారు. ఈ డేటాతో లోన్ తీసుకున్న వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ, అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. బ్యాంకు అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోను అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు. రుణ యాప్ వేధింపులు కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు చేపడతామన్నారు.


గంజాయి నిర్మూలన  


గంజాయి నిర్మూలనకు పోలీసుశాఖ సమర్థవంతంగా చర్యలు చేపట్టిందన్నారు. పోలీసుశాఖ చేపట్టిన చర్యలు ఫలితంగా ఏజన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు లేకుండా నియంత్రించామని డీజీపీ తెలిపారు. అంతేకాకుండా గిరిజనులు గంజాయికి బదులుగా వేరే పంటలతో లబ్ధి పొందే విధంగా ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఆకస్మికంగా వాహన, లాడ్జి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఏపీలాగా ఇతర రాష్ట్రాల్లో కూడా గంజాయిని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టినట్లయితే రానున్న 3-4 సంవత్సరాల్లో గంజాయి అక్రమ రవాణను పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు ఏవోబీలో ఉన్నాయని, వారి చర్యలను నియంత్రించేందుకు ఎప్పటిలాగే పోలీసుశాఖ చర్యలు కొనసాగిస్తుందన్నారు.  పోలీసు నియామకాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కొన్ని అంశాలను పరిశీలిస్తుందని, త్వరలో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.