Minister KTR : హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా విస్తరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి వద్ద రూ. 466 కోట్ల వ్యయంతో 2.81 పొడవుతో నిర్మించిన శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ముఖ్యంగా ఎం.ఎం.టి.ఎస్, మెట్రో రైలు, ఆర్టీసీ విస్తరణకు పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎం.ఎం.టి.ఎస్ అభివృద్ధికి రూ. 200 కోట్లను విడుదల చేసినట్లు, అదేవిధంగా రెండో విడతలో మొత్తం 63 కిలోమీటర్ల మెట్రో రైలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. బి.హెచ్.ఇ.ఎల్ నుంచి లక్డికాపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మరో 5 కిలోమీటర్ల తో పాటుగా మైడ్స్ స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా ప్రజారవాణా అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుందని కేటీఆర్ తెలిపారు.
 
శరవేగంగా ఎస్ఆర్డీపీ పనులు 


ఎస్ఆర్డీపీ సీఎం కేసీఆర్ మాసపత్రిక అని, ముఖ్యమంత్రి ఆలోచన నుంచి వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 2014-15 సంవత్సరంలో హైదరాబాద్ మహానగర దినదినాభివృద్ధి, బ్రహ్మాండంగా విస్తరిస్తోందన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని అందుకు ప్రజా అవసరాలను గుర్తించి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ ఎస్.ఆర్.డి.పి పథకాన్ని జీహెచ్ఎంసీకి ఆదేశాలు ఇచ్చారన్నారు. రూ. 8 వేల కోట్లతో ఈ పథకాన్ని చేపట్టాలని రూపకల్పన చేసి 48 పనులను చేపట్టగా ఇప్పటికే 33 పనులు పూర్తిచేసినట్లు, మిగతా పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా చాలా దేశాలు, దేశంలోని పలు నగరాలు తిరిగానని ఇక్కడ ఉన్న సదుపాయాలు దేశంలోని మెట్రో నగరాలు అయిన చెన్నై, బెంగళూరు, ముంబాయి, కోల్ కోతా, దిల్లీ, అహ్మదాబాద్ లలో లేవన్నారు. హైదరాబాద్ లో ఉన్న అత్యున్నత మౌలిక సదుపాయాలు మరెక్కడా లేవన్నారు. 


డిసెంబర్ నాటికి కొత్తగూడ ఫ్లైఓవర్ 


రోజురోజుకు పరిశ్రమ, ఐటీ రంగం విస్తరించడం వలన ఏడాదికి లక్ష కుటుంబాలు స్థిరపడుతున్నాయని, ఒకే ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ నలుమూలలు విస్తరించడంతో పాటు అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఓ.ఆర్.ఆర్ లోపల ఉన్న ప్రాంతం జీహెచ్ఎంసీలో కలిసే విధంగా కనిపిస్తాయన్నారు. ఎస్.ఆర్.డి.పి రెండో దశలో రూ. 3,500 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన రోడ్లు వర్షం పడినా ఇబ్బంది కలుగకుండా సి.ఆర్.ఎం.పి ద్వారా 710 కిలో మీటర్ల రోడ్డు  చేపట్టినట్లు, అదేవిధంగా ప్రధాన రోడ్లకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లింక్ రోడ్లను విస్తృతంగా చేపట్టినట్లు తెలిపారు. రేపటి అవసరాల కోసం మాస్టర్ ప్లాన్ ను తయారు చేసిన జనాభాకు అనుకూలంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో స్టేజ్ -2 ద్వారా గచ్చిబౌలి నుండి కొండాపూర్ వరకు థర్డ్ లేవల్ బ్రిడ్జిని మరో పది నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా కొత్తగూడ ఫ్లైఓవర్ ను డిసెంబర్ చివరికి గానీ, వచ్చే సంవత్సరం జనవరి  మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలిపారు. గోపన్ పల్లి ఫ్లైఓవర్ ను కూడా పూర్తి చేసేందుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కోరుతామని తెలిపారు. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ కు అండర్ పాస్ నిర్మాణాన్ని రూ. 20 కోట్ల తో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.