Minister Harish Rao : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. గ్రామాలను వరదలు ముంచెత్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. వర్షాల కారణంగాఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుంచి ప్రజల్ని కాపాడేందుకు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉండాలన్నారు. ఆయా ఆసుపత్రుల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఎలాంటి కేసులు వచ్చినా అడ్మిట్ చేసుకొని వైద్యం అందించాలని ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల వైద్యాధికారులు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా జిల్లాల్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.  


సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం 


వర్షాల పరిస్థితులపై సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులు విచారిస్తున్నారని మంత్రి చెప్పారు. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొవ‌డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సూచించారన్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తతో ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, డయేరియా తదితర రోగాల పట్ల అవగాహన పెంచాలని, రోగ నిర్ధారణ పరీక్షలు వెంటనే నిర్వహిస్తూ బాధితులకు చికిత్స అందించాలన్నారు.


బర్త్ వెయిటింగ్ రూములు 


సబ్ సెంటర్ స్థాయి నుంచి జిల్లా ఆసుపత్రి వరకు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, పంచాయతీ రాజ్ మున్సిపల్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుని వైద్య సేవలు అందించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో, స్థానిక ప్రజా ప్రతినిధుల సాయం తీసుకోవాలన్నారు. 108 వాహ‌నాలు వెళ్లలేని ప్రాంతాలు ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. వాగులు పొంగటం, రోడ్లు పాడవడం వల్ల గిరిజన ప్రాంతాల‌కు రోడ్ కనెక్టివిటీ పోయే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి చోట్ల రోగులతో పాటు గర్భీణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బర్త్ వెయిటింగ్ రూములను గర్భీణులు సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.  


ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష 


డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సహా డైట్, పారిశుద్ధ్య విభాగాల్లో పని చేసే వారికి వేతనాలు సకాలంలో అందేలా బిల్స్ త్వరగా సబ్ మిట్ చేయాలన్నారు. ప్రసూతి, ఆర్థోపెడిక్, జ‌న‌ర‌ల్ స‌ర్జరీ, కంటి, గుండె స‌హా అన్ని విభాగాల్లో ఆరోగ్య శ్రీ సేవ‌లు పెంచాలన్నారు. ప్రణాళిక రూపొందించుకొని ఆప‌రేష‌న్ థియేట‌ర్ వినియోగం కూడా పెంచాలన్నారు. రోగుల‌కు త్వరితగతిన సేవలు అందించాలనీ, ఈ విషయంలో మంచి పనితీరు నమోదు చేసిన ఎంజీఎం, నిజామాబాద్, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రులను మంత్రి హరీశ్ రావు అభినందించారు.