Hyderabad Metro Rail : హైదరబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అమీర్‌పేట్-రాయదుర్గం మార్గంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రాయదుర్గం-అమీర్‌పేట్ ఒకవైపు మార్గంలోనే రైళ్లు నడుపుతున్నారు. ఒకే రూట్‌లో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే రైళ్ల రాకపోకల ఆలస్యానికి సంబంధిత అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఇటీవల తరచూ మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. మెట్రో రైళ్లలో తరచూ టెక్నికల్ ఇష్యూలు రావడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా రైళ్లను నడపాలని కోరుతున్నారు. అలాగే రాకపోకల ఆలస్యంపై రైలు సిబ్బంది ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. సాంకేతిక సమస్యలకు ప్రయాణికులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
(రాయదుర్గం మెట్రోస్టేషన్ లో ప్రయాణికుల రద్దీ)
నిన్న ఎర్రమంజిల్ వద్ద నిలిచిపోయిన రైలు
హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. సాంకేతిక సమస్యతో మెట్రో రైలు మరోసారి నిలిచిపోయింది. సోమవారం ఎల్బీ నగర్ వెళ్తోన్న మెట్రో రైలును టెక్నికల్ ప్రాబ్లమ్ తో నిలిపివేశారు. దీంతో రైలును ఎర్రమంజిల్ స్టేషన్ లో నిలిపివేసిన సిబ్బంది, ప్రయాణికులను దింపేశారు. ప్రయాణికులను మరో రైలులో గమ్యస్థానాలకు తరలించారు. ఎల్బీ నగర్ వెళ్తున్న రైలు నిలిచిపోవడంతో వెనుక వస్తున్న రైళ్ల రాకపోకలకు ఆలస్యం అయింది. రైళ్లు ఆలస్యంగా నడవటం, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సాంకేతిక సమస్య తలెత్తిన రైలును పాకెట్ ట్రాక్ పై నిలిపి సాంకేతిక సమస్యను క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది.
తరచూ సాంకేతిక సమస్యలు
సోమవారం ఉదయం ఎర్రమంజిల్ స్టేషన్‌లో దాదాపు అరగంట పాటు మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కారిడార్-1 మియాపూర్-ఎల్‌బీనగర్ రెడ్‌లైన్ మార్గంలో సోమవారం ఉదయం 9 గంటలకు మెట్రో రైలు మియాపూర్‌లో ప్రయాణికులతో బయలుదేరింది. 9.15 నిమిషాలకు పంజాగుట్ట స్టేషన్ దాటి ఎర్రమంజిల్ స్టేషన్ కు చేరింది. కొంత మంది ప్రయాణికులు స్టేషన్‌లో దిగిన తర్వాత లోకో పైలెట్ రైలును ముందుకు కదిలించేందుకు ప్రయత్నించినా టెక్నికల్ సమస్యతో రైలు కదలలేదు. దాదాపు అరగంటపాటు శ్రమించినా సిబ్బంది సాంకేతిక సమస్య అంతపట్టని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులను రైలు నుంచి దించేశారు. బ్రేకింగ్ సిస్టమ్‌లో తలెత్తిన సమస్యతో రైలు నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. అధికారులు స్టేషన్‌లో ఆగిపోయిన రైలును వెంటనే ఎర్రమంజిల్-పంజాగుట్ట స్టేషన్ల మధ్య పాకెట్ ట్రాక్‌కు తరలించారు. అనంతరం మరో రైలులో ప్రయాణికులను పంపించారు. వేగంగా ఆఫీసులు, ఇతర పనులపై మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్న ప్రయాణికులకు రైళ్ల సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి సహజంగా అధికంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళలో మరింత రద్దీగా ఉంటాయి. ఈ సమయాల్లోనే రైళ్లలో టెక్నికల్ ఇష్యూలు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో అధికారులు స్పందించి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులకు కోరుతున్నారు.