తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ నెల 27న కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. దీనికి యువగళం అని పేరు పెట్టారు. దీనిపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఆఖరి వరకు టెన్షన్ పెట్టిన చిత్తూరు పోలీసులు ఇవాళ(మంగళవారం) అనుమతులు మంజూరు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పి.ఏ. మనోహర్ సహా టీడీపీ లీడర్లు జిల్లా పోలీసులకు అభ్యర్థించారు. నారా లోకేష్ ఈ నెల 27వ తేదీ కుప్పం నుంచి తలపెట్టిన పాదయాత్ర, కుప్పంలో పబ్లిక్ మీటింగ్‌కు అనుమతి కావాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనిపై అన్ని పరిశీలించిన పోలీసులు పాదయాత్రకు కొన్ని షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు. యాత్రకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అనుమతి ఇవ్వకుండా కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని పోలీసులు, ప్రభుత్వంపై టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేశాయి. 


లోకేష్ పాదయాత్రకు పోలీసులు పెట్టిన షరతులు ఇవే


టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ఈ రూల్స్‌ బ్రేక్‌ చేయకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. 
1. ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌లకు అంతరాయం కలిగించకూడదు 
2. బహిరంగ సభలు సమయానికి ముగించాలి 
3. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదు. 
4. రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించాకుడదు. 
5. సమావేశాల వద్ద ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలి 
6. సమావేశ స్థలం దగ్గర అగ్నిమాపక యంత్రం ఉంచాలి. 
7. పాదయాత్రలో బాణసంచా పేల్చడం పూర్తిగా నిషేధం
8. సమావేశాలకు మారణాయుధాలు తీసుకెళ్లకుండా నియంత్రించాలి 
9. డ్యూటీలో ఉన్న పోలీసులు ఇచ్చే ఆదేశాలు పాటించాలి  
10. శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలి. 


నారా లోకేష్ పాదయాత్ర మొదటి రోజు షెడ్యూల్‌ !


టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత‌ నియోజకవర్గంమైన కుప్పంలో ఈ నెల 27న మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజస్వామి ఆలయంలో నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత కుప్పంలోని బీఆర్‌ అంబేద్కర్‌, ఎన్టీఆర్‌, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు నివాళులు అర్పిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సివిల్‌ కేసులు ఎదుర్కొంటున్న మహిళా కార్యకర్తలతో నారా లోకేష్ సమావేశం అవుతారు. 4.45 గంటలకు కమతమూరు రోడ్‌లో గంట పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడే వివిధ వర్గాల ప్రజలతో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు పీఈఎస్‌ వైద్య కళాశాల సమీపంలో బస చేయడంతో తొలి రోజు యాత్ర ముగుస్తుంది. 


మూడు రోజులు కుప్పంలో యాత్ర


రెండో రోజు ఉదయం 8 గంటలకు పాదయాత్ర మొదలు కానుంది. ఉదయం 8.10 గంటల నుంచి గంటపాటు యువతతో సమావేశమై వారితో ముచ్చటిస్తారు. వారి సమస్యలు తెలుసుకొని వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. అదే రోజు సాయంత్రం 5.50 గంటలకు పాదయాత్ర పూర్తి అవుతుంది. మూడో రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కొనసాగునుంది. మూడోవ రోజు సాయంత్రం 5.55 గంటలకు రామకుప్పం మండలం, చెల్దిగానిపల్లెకు చేరడంతో కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర ముగియనుంది.