తిరుమలలో శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ నేడు (జనవరి 24)న విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ టికెట్ల విడుదలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనను విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీని నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో టీటీడీ నకిలీ వెబ్‌సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తమ అధికారిక వెబ్‌సైట్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. 


అంగప్రదక్షిణం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్‌లోని క్యూ వద్దకు చేరుకోవాలి. అక్కడ టికెట్, ఐడీని చెక్ చేసిన అనంతరం భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు. స్త్రీ పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లలోకి ప్రవేశం ఉంటుంది. శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత భక్తులను అంగప్రదక్షిణానికి అనుమతినిస్తారు. 2.45 గంటలకు తొలుత స్త్రీలను, ఆ తర్వాత పురుషులను అంగప్రదక్షిణానికి పంపుతారు. అంగప్రదక్షిణ పూర్తి చేసిన మహిళలు వెండి వాకిలి వద్దకు చేరుకున్నాక పురుషులను అనుమతిస్తారు. 


అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. పురుషులు పంచె, పైన కండువా, స్త్రీలు చీర, లంగా వోణీ వంటివి ధరించాలి. మిగతా ఎలాంటి దుస్తులు ధరించినా అనుమతించరు. అంగప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తారు.


ఈ నెల 28న తిరుమలలో రథసప్తమి
జనవరి 28న సూర్యభగవానుడి జయంతి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథ సప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలిచే రథసప్తమి వేడుకల సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు మాఢ వీధుల్లో విహరిస్తూ.. భక్తులను అనుగ్రహిస్తారు. రథ సప్తమి పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.


వాహన సేవలు ఇలా..
ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) - సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు- చంద్రప్రభ వాహనం


కొనసాగుతున్న భక్తుల రద్దీ


తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ కొనసాగుతుంది. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం రోజున 70,413 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 32,206 మంది తలనీలాలు సమర్పించగా, 3.37 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 10 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనంకు 18 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.