Neelakanta Bhanu : హైదరాబాద్ కు చెందిన గణిత శాస్త్ర నిపుణుడు, ప్రపంచ అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్ పేరు తెచ్చుకున్న నీలకంఠ భాను ప్రకాష్ ఉత్తమ యంగ్ పర్సన్  అవార్డును గెలుచుకున్నారు. హైదరాబాద్ చెందిన నీలకంఠ భాను ప్రకాష్ జొన్నలగడ్డ వ్యక్తిగత అభివృద్ధి, విజయాల కేటగిరి కింద 2022 సంవత్సరానికి JCI ఇండియా అత్యుత్తమ యువకుడిగా అవార్డు పొందారు. ఈ అవార్డును JCI ఇండియా జాతీయ అధ్యక్షుడు అన్షు సరాఫ్ దిల్లీలోని లీలా యాంబియన్స్ కన్వెన్షన్ సెంటర్‌లో భాను ప్రకాష్ కు అందజేశారు. ఈ అవార్డును పొందిన అనంతరం నీలకంఠ భాను ప్రకాశ్ మాట్లాడుతూ.. ''ఈ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రయాణం చాలా మంది యువకులను వారి వారి రంగాలలో అసాధారణమైన పని చేయడానికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. ఈ కేటగిరీకి నన్ను నామినేట్ చేసినందుకు JCI విశాఖ వ్యాలీకి  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.



  గర్వకారణం 


జేసీఐ విశాఖ వ్యాలీ మెంటర్ కేవీ రావు మాట్లాడుతూ, “2022లో అత్యుత్తమ యువకుడిగా గెలుపొందినందుకు నీలకంఠ భానుని నేను అభినందించాలనుకుంటున్నాను. భాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం. అతను నిర్మించిన స్టార్టప్ భాంజు (Bhanzu) భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు గణిత అభ్యాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అతను మరిన్ని విజయాలు సాధించాలని అసాధారణ విజయాలతో మన దేశ యువతలో స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నాను." అన్నారు. 


భాంజు స్టార్టప్ 


"గణితశాస్త్రంలో ఉసేన్ బోల్ట్" అని పిలిచే నీలకంఠ భాను 2020లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డులకెక్కారు. అతను 17 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా నిలిచారు.  30,000 మంది విద్యార్థులకు అందించే గణిత అభ్యాస వేదిక భాంజు (Bhanzu) అనే స్టార్టప్ ను నీలకంఠ భాను ప్రారంభించారు. ఇది విద్యార్థులకు వారి గణిత భయాన్ని పోగొట్టడానికి, సరదాగా గణిత బోధనా పద్ధతులతో నేర్చుకోవడంలో సహాయపడుతుంది. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (JCI) 1949 నుంచి భారతదేశంలో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. దేశంలోని యువతీ యువకుల నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. JCI ఇండియా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్‌లో రెండో అతిపెద్ద సభ్య దేశం. ప్రస్తుతం ఇది భారతదేశం అంతటా 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చురుకుగా పనిచేస్తుంది.  


 వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్


హైదరాబాద్ కు చెందిన నీలకంఠ భాను ప్రకాష్ 2020లో మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ (ఎంఎస్‌ఓ) లో మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించారు. నీలకంఠ భాను ప్రకాష్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్ అనే టైటిల్ గెలుచుకున్నారు. ఈ టైటిల్ గెలవడం నీలకంఠ భాను ప్రకాష్ కు ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఇలాంటి అరుదైన అనేక రికార్డులను దక్కించుకున్నారు . దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సెయింట్ స్టీఫెన్ కాలేజీలో మ్యాథమెటిక్స్ ఆనర్స్ చేసిన నీలకంఠ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా మానవ కాలిక్యులేటర్‌గా 4 ప్రపంచ రికార్డులు సాధించారు . 50 లిమ్కా రికార్డులు దక్కించుకున్నారు.