TS Annual Crime Report : తెలంగాణ రాష్ట్ర పోలీసు 2022 వార్షిక నేర నివేదిక‌ను డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి గురువారం విడుద‌ల చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది నేరాల శాతం 4.4కు పెరిగింద‌ని ఆయన తెలిపారు. మ‌హిళ‌ల‌పై నేరాలు 3.8 శాతం పెరిగగా, హ‌త్య కేసులు 12 శాతం, అత్యాచారాలు 17 శాతం త‌గ్గాయని వెల్లడించారు. 152 కేసుల్లో నిందితుల‌కు జీవిత ఖైదు ప‌డింద‌న్నారు. డ‌య‌ల్ 100 ద్వారా 13 ల‌క్షల ఫిర్యాదులు వచ్చాయని,  సామాజిక మాధ్యమాల ద్వారా 1.1 ల‌క్షల ఫిర్యాదులు, పోలీసు స్టేష‌న్లలో 5.5 ల‌క్షల ఫిర్యాదు న‌మోద‌య్యాయ‌ని డీజీపీ తెలిపారు. ఈ నెల 31న తాను రిటైర్డ్ అవుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తన కెరియర్ లో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. గడిచిన 8 ఏళ్లుగా ప్రభుత్వం, మీడియా, ప్రజలు, సిబ్బంది తనకు చాలా సహకరించారన్నారు. 
 
"విధుల దుర్వినియోగం, క్రమశిక్షణ ఉల్లంఘించిన పోలీస్ ఆఫీసర్స్ పై చర్యలు తీసుకుంటున్నాం. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో కమిషన్ విచారణ పూర్తి అయింది. దిశ కమిషన్ రిపోర్ట్ హైకోర్టుకి ఇచ్చింది, ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉంది. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై FIR నమోదు చేయలేదు. హైకోర్టు ఆదేశాలతో ముందుకు పోతాం." -మహేందర్ రెడ్డి, డీజీపీ


2022  వార్షిక నేర నివేదికలో వివరాలు 



  • మహిళలపై నేరాలు - 17908 

  • వరకట్న హత్యలు - 126

  • 15% పెరిగిన కిడ్నాప్ కేసులు

  •  ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసులు- 1176  

  • గంజాయి కేసులు - 1104 , 31 వేల కేజీల గoజాయి సీజ్ 

  • డ్రగ్స్ కేసులు- 72  

  • చిన్నారులపై  అఘాయిత్యాలకి పాల్పడిన కేసులు - 2432 

  • రాష్ట్ర వ్యాప్తంగా  రోడ్డు ప్రమాదాలు - 19248 , రోడ్డు ప్రమాదాల్లో మరణాలు - 6746

  • ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనపై ఫైన్ విధింపులు - రూ. 612 కోట్లు  

  • ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు - 1 కోటి65 లక్షలు

  • హాక్ ఐ ద్వారా ఫిర్యాదులు- 61 674  


షీ టీమ్స్ 


షీ టీమ్స్ కు 6157 ఫిర్యాదులు అందగా, అందులో 2128 కేసులు నమోదు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 864 పెట్టీ కేసులు నమోదు చేయగా, 1323 మందికి కౌన్సలింగ్ చేశామన్నారు. ఈ కేసుల్లో 1323 మందికి వార్నింగ్ ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 భరోసా సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 ,16,875 నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. పోలీస్ రిక్యూట్ మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో 7 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.  


సైబర్ క్రైమ్


రాష్ట్ర వ్యాప్తంగా 13,895 సైబర్ క్రైమ్ కేసులు  నమోదు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 57 శాతం సైబర్ నేరాలు పెరిగాయన్నారు. జీరో FIR లు 938 నమోదు కాగా  12 శాతం జీరో FIR లు పెరిగాయన్నారు. IPC కేసులు 2021 లో  136841 నమోదు కాగా, 2022 లో 142917 కేసులు నమోదు అయ్యాయన్నారు. అంటే 2 % కేసులు పెరిగినట్లు వెల్లడించారు. హత్య నేరాల్లో 72 కేసుల్లో 96 మంది నిందితులకు జీవిత ఖైదీ పడిందన్నారు. 


2126 రేప్ కేసులు 


"రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్ చైల్డ్రన్స్ 724 కేసులు నమోదు అయ్యాయి. 2126 రేప్ కేసులు నమోదు , 9 కేసుల్లో గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేశారు. తెలిసిన వ్యక్తులు 2117 కేసులో ఫ్యామిలీ మెంబెర్స్, ఫ్రెండ్స్, లవర్స్, సహా ఉద్యోగులు రేప్ లు చేశారు. NDPS యాక్ట్ కేసులు 1176 గత ఏడాది తో పోలిస్తే 5 % తగ్గాయి. 205 మందిపై పీడీ యాక్ట్ లు నమోదు చేశాం. ఆపరేషన్ ముస్కాన్ 3406 మంది పిల్లలు రెస్క్యూ చేశాం. ఆపరేషన్ స్మైల్ 2822 మంది పిల్లలు రెస్క్యూ చేశాం. 4 లక్షల మందికి పాస్ పోర్ట్ వేరిఫికేషన్ చేశాం. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ సేఫ్టీ బ్యూరో, నార్కోటిక్ బ్యూరో రెండు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం వేయి మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలు పోలీస్  వెహికల్ కు జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలపై వెపన్ మేనేజ్మెంట్ ను తీసుకొచ్చాం. 8 ఏళ్లుగా పోలీస్ వెల్ఫేర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఉద్యోగుల పిల్లల ఎడ్యుకేషన్, హెల్త్ స్కీం, ఇల్లు కొనుగోలు చేసేవిధంగా ప్రభుత్వం సాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కల్యాణ మంటపాలు కట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది." - మహేందర్ రెడ్డి, డీజీపీ