Hyderabad: పాతబస్తీ మెట్రో పనులను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ వేగవంతం చేసింది. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ఆదివారం డ్రోన్‌ సర్వే చేపట్టింది. 5.5 కిలోమీటర్ల మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం ఈ సర్వే చేపట్టింది. మసీదులు, ఆలయాలు, తదితర కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా పిల్లర్స్‌ నిర్మించేందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ అధికారులు డ్రోన్‌ సర్వేను ప్రారంభించారు. డ్రోన్‌ నుంచి సేకరించిన హై రెజల్యూషన్‌ చిత్రాలు, రియల్‌ టైమ్‌ డేటా, 3డీ మోడలింగ్, జియోగ్రాఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ద్వారా ఆయా కట్టడాల కొలతలను అంచనా వేయనున్నారు. 


ఈ సందర్భంగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌  ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. దారుల్‌ఫా జంక్షన్‌ నుంచి షాలిబండ జంక్షన్‌ వరకు ఉన్న 103 కట్టడాలు ఉన్నాయని, వాటి పరిరక్షణ కోసం ఈ డ్రోన్‌ సర్వే చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు చెప్పారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు  రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేయనున్నారురు. స్టేషన్‌ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. కర్వేచర్‌ సర్దుబాటు, వయాడక్ట్‌ డిజైన్,ఎత్తులు, మెట్రో పిల్లర్‌ లొకేషన్‌లలో తగిన మార్పులు,  ఇంజనీరింగ్‌ పరిష్కారాల కోసం  డ్రోన్‌  సర్వే ద్వారా సేకరించిన డేటా ఉపయోగపడనుంది. 


ఐదు కిలోమీటర్లు, ఐదు స్టేషన్లు  
ఎంజీబీఎస్ నుంచి పురానీ హవేలీ, ఇత్తెబార్‌ చౌక్, అలీజాకోట్ల, మీర్‌ మోమిన్‌ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌ ఉంటుంది. ఈ మెట్రో రైల్‌ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్‌ తర్వాత సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్‌లు ఉంటాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ స్టేషన్‌లకు మధ్య 500 మీటర్లే దూరం. నగరంలో ఆయా స్థలాలకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.  


ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు పాతబస్తీ మెట్రో మార్గంలో త్వరలో  భూసామర్ధ్య పరీక్షలు  ప్రారంభించనున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా నుంచి ఈ  పరీక్షలను  ప్రారంభించనున్నారు.  ఈ మార్గం అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు లేకుండా జేబీఎస్‌ నుంచి నేరుగా ఫలక్‌నుమాకు ప్రయాణించవచ్చు. వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. చార్మినార్‌ను మెట్రో రైల్‌లో వెళ్లి సందర్శించుకోవచ్చు. సాలార్‌జంగ్‌ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్‌ వంటి చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చు. 


నిజానికి జేబీఎస్‌ నుంచి పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకు 2012లోనే  మెట్రో రైల్‌  ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. కానీ పాతబస్తీలోని వివిధ  ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్‌ వరకు పరిమితం చేశారు. కొద్ది రోజుల తరువాత సీఎం కేసీఆర్‌ పాతబస్తీ మెట్రోకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకోసం 500 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఈ మార్గంలో సర్వే పనులను ప్రారంభించింది.