Azharuddin On Tickets Issue : భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో విక్రయించారనే ప్రచారంలో వాస్తవం లేదని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 25న ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌ ఏర్పాట్లు, టికెట్ల విక్రయాలపై అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయన్నారు. జింఖానా గ్రౌండ్‌లో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరం అన్నారు. టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే బ్లాక్‌లో విక్రయం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. టికెట్ల విక్రయాలపై అన్ని వివరాలు అందిస్తామన్నారు. 


తొక్కిసలాటతో హెచ్సీఏకు సంబంధం లేదు


"బ్లాక్ లో విక్రయించడం అవాస్తవం. ఆన్ లైన్ లో టికెట్లు విక్రయిస్తే బ్లాక్ లో అమ్మడం సాధ్యం కాదు. మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. చాలా ఏళ్ల తర్వాత మ్యాచ్ నిర్వహిస్తున్నాం. 11,450 టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించాం. కార్పొరేట్ బుకింగ్స్ ద్వారా 6 వేల టికెట్లు విక్రయించాం. నిన్న జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాటకు HCA కు ఎలాంటి సంబంధం లేదు. జింఖానా గ్రౌండ్ వద్ద ఏం జరిగిందో అందరికీ తెలుసు. గతంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతుంది. ఆ బాధ్యతంతా పోలీసులు చూసుకోవాలి. టికెట్ల విక్రయాన్ని పేటీయమ్ ఇచ్చాం. వాళ్లే చూసుకుంటున్నారు. దానికి హెచ్సీఏకు సంబంధంలేదు. గాయపడిన వారి వైద్య ఖర్చులు హెచ్సీఏ భరిస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు"- అజారుద్దీన్


మొత్తం 26 వేల టికెట్ల అమ్మకాలు జరిగాయని అజారుద్దీన్ తెలిపారు.  టికెట్ల అమ్మకాలను పేటీయంకి ఇచ్చామని, వారిదే బాధ్యత అన్నారు. హెచ్.సి.ఎలో విభేదాలు ఉన్న మాట వాస్తవమే కానీ మ్యాచ్ సక్సెస్ చేయడానికి అందరూ పనిచేస్తున్నారన్నారు.  కోవిడ్ వల్ల ఫండ్స్ లేవని, ఉన్న నిధులతో ఏర్పాట్లు చేశామన్నారు. 


 టికెట్ల విక్రయాలు ఇలా 



  • సెప్టెంబర్ 15న ఆన్ లైన్ 11,450 టికెట్లు

  • కార్పొరేట్ బాక్స్ 4000 టికెట్లు 

  • జింఖానా గ్రౌండ్ వద్ద  2100 టికెట్లు విక్రయాలు 

  • ఆన్ లైన్ లో 3000 టికెట్లు 

  • ఇంటర్నల్ గా  6000 టికెట్లు 


టికెట్ల విక్రయాల్లో పెద్ద స్కామ్- కొండా విశ్వేశ్వర్ రెడ్డి 


టికెట్ల విక్రయాలను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. టికెట్ల విక్రయాల్లో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. అజారుద్దీన్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు. టికెట్ల రేట్లను మూడు రెట్లు అధికంగా అమ్మారన్నారు. ప్రస్తుతం విక్రయించిన టికెట్లను రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి విక్రయించాలని కోరారు. ఇదంతా ముఠా స్కామ్ లా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హెచ్సీఏకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీసీసీఐ సీరియస్ గా ఉందన్నారు. టికెట్ల విక్రయాలపై త్వరలో విచారణ జరుగుతుందన్నారు. టికెట్ల కోసం వచ్చినవాళ్లపై పోలీసులు ఎందుకు లాఠీ ఛార్జ్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవహారంలో తలదూర్చిందన్నారు. ఇష్యూ పెద్దదవుతుందని తగ్గించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 39 వేల టికెట్లు ఏం అయ్యాయని ప్రశ్నించారు. బ్లాక్ లో టికెట్ల అమ్ముతున్నారని ఆరోపించారు. అజారుద్దీన్ కు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందని విమర్శించారు. 


Also Reead : HCA Tickets Issue : భారత్-ఆసీస్ మ్యాచ్ టికెట్ల వివాదం, అజారుద్దీన్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు


Also Read : HCA Azharuddin : మ్యాచ్ నిర్వహణ అంటే అంత తేలికకాదు, జింఖానా ఘటనలో హెచ్సీఏ తప్పేం లేదు- అజారుద్దీన్