Hyderabad News : హనుమాన్‌ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్‌ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. 24 గంటలపాటు నగరంలో వైన్ షాపులు, బార్లు మూసివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడతాయని పోలీసులు వెల్లడించాయి.  ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్స్ లోని బార్లకు ఈ నిబంధనలు వర్తించవని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు. వీటిని బేఖాతరు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని సీపీ తెలిపారు. 






విజయ యాత్ర రూట్ మ్యాప్ పరిశీలించిన సీపీ సీవీ ఆనంద్  


హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బజ రంగ్ దళ్, వీహెచ్పీల ఆధ్వర్యంలో శనివారం గౌలిగూడ రాంమందిర్ నుంచి నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ రూట్ మ్యాప్ ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఆయనతో పాటు అడిషనల్ సీపీ చౌహన్ , కార్తికేయ, జాయింట్ సీపీ రమేష్ రెడ్డి, విశ్వాప్రసాద్, ఏవీ రంగనాథ్ , డీసీపీ సతీష్, ఏసీపీ దేవేందర్, సీఐలు రవీందర్ రెడ్డి, సుబ్బిరామి రెడ్డి, భిక్షపతి రాంమందిర్ లో పూజలు నిర్వహించిన అనంతరం శోభయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు. బజరంగ్ దళ్, వీహెచ్పీ నాయకులతో ఏర్పాట్లపై చర్చించారు. రూట్ ను పరిశీలించడానికి గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్ బంద్ హనుమాన్ దేవాలయానికి ప్రత్యేక బస్సులో అధికారులు తరలివెళ్లారు.



Also Read : KTR Letter: కడుపులో ద్వేషంతో కపట యాత్రలు చేస్తే ఎలా? మీవి సిగ్గూ ఎగ్గూ లేని యాత్రలు: కేటీఆర్