Hyderabad Rains : హైదరాబాద్ ను వరుణుడు ముంచెత్తాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వడగండ్ల వాన కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నియోజకవర్గ పరిధి చింతల్, ఐడీపీఎల్, కుత్బుల్లాపూర్ ,సుచిత్ర, గండి మైసమ్మ, బాచుపల్లి, సూరారం, పలు ప్రాంతాలలో వడగళ్ల వాన పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌తో పాటు ముసాపేట్, కేపీహెచ్‌బీ, మియాపూర్‌లోనూ భారీగా వడగండ్ల వర్షం పడింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉరుములు, మెరుపులతో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది.
మరో రెండ్రోజుల పాటు వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రెండ్రోజుల నుంచి పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడుతుందని స్పష్టం చేసింది. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు పడుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావం
తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీచేసింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలతో పాటు వడగండ్ల వాన కురుస్తుంది. హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వర్షంతో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి మధ్య ప్రదేశ్ వరకు గల ద్రోణీ... దక్షిణ కర్ణాటక నుంచి ఝార్ఖండ్ వరకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా మీదుగా కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.