Revanth Reddy : సీపీ సీవీ ఆనంద్ ఓ పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్టులు ఎందుకు పెడతారాని ఆయన ప్రశ్నించారు. కొందరు తనపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని సీపీ ఆనంద్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో విస్తృతస్థాయి సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న ఎవరో తనకు తెలియదన్నారు. తీన్మార్ మల్లన్న ఎవరినో విమర్శిస్తే తనకేం సంబంధమన్నారు. ఎవరైనా తిడితే వారిని చెప్పుతీసుకొని కొట్టండన్నారు. అంతే కానీ తనపై అనవసర విమర్శలు చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో ఎవరో పెడుతున్న పోస్ట్‌లను తనకు అంటకట్టొద్దని రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నిస్తు్న్నానన్నారు. సొంత పార్టీ నేతలపై  వ్యతిరేక పోస్టులు ఎలా పెడతామని ప్రశ్నించారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏఐసీసీ ఆదేశాలతోనే కార్యవర్గ సమావేశం నిర్వహించామన్నారు. భారత్‌ జోడో పాదయాత్రపై ఈ సమావేశంలో చర్చించామన్నారు.  ఈనెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్షలు ఏర్పాటుచేస్తామన్నారు.  


హాత్ సే హాత్ జోడో అభియాన్ సమావేశాలు 


రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రజలకు వివరించేందుకు మండల స్థాయిలో ‘హాత్‌ సే హాత్‌’ జోడో అభియాన్‌ సమావేశాలు నిర్వహించాలని రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనవరి 26న కశ్మీర్‌లో రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర ముగియనుంది. రాహుల్ పాదయాత్ర అవశ్యకతను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని రేవంత్ రెడ్డి కార్యకర్తలను కోరారు. పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో గందగోళం నెలకొంది. రేవంత్‌రెడ్డి నేతలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.  గొడవలు వద్దని, కేవలం సమావేశానికి సంబంధించినవి మాత్రమే మాట్లాడాలని సూచించారు. ఇతర విషయాలు మాట్లాడొద్దని నేతలకు విజ్ఞప్తి చేశారు. సమావేశ అజెండాకు సంబంధించినవే మాట్లాడాలని కోరారు. నేతలందరూ ఓపికపట్టాలని రేవంత్‌ కోరారు. ఈనెల 19లోపు రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ చెప్పిందని, ఈనెల 20 నుంచి 24 వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు. కార్యకర్తలు, నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని రేవంత్ సూచించారు. ధరణి సమస్యపై పోరాడాలన్నారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ ప్రజలకు వివరించాలన్నారు. 


అపోహలు వద్ద నమ్మకంతో పనిచేయాలి 


హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌పై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్‌ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఎలా చెప్తారని ప్రశ్నించారు. సీవీ ఆనంద్ అబద్దాలు చెబుతున్నారన్నారు. సొంత పార్టీ నేతలపై ఎవరైనా పోస్టులు పెడతారా? అని ప్రశ్నించారు. కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పూలే కాదు అప్పుడప్పుడు రాళ్లు కూడా పడతాయని రేవంత్ అన్నారు. తనపై ఉన్న అపోహలు తీసేసి నమ్మకంతో పనిచేయాలని పార్టీ నేతలకు కోరారు. కాంగ్రెస్ వార్‌ రూమ్‌కు వెళ్లి సునీల్‌ కనుగోలు టీమ్‌ సభ్యులను ఎలా అరెస్టు చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయాన్ని పార్టీ చాలా తీవ్రంగా పరిగణించిందన్నారు.