Goddbye2022:


మిలెట్స్‌పై శ్రద్ధ 


అప్పుడే ఏడాది గడిచిపోయిందా..? ప్రతి సంవత్సరమూ మనకు ఇలాగే అనిపిస్తుంది. అంత హడావుడిగా లైఫ్‌ని లీడ్ చేసేస్తున్నాం అంతా. మొన్నే కదా జనవరి మొదలైంది అనిపించినా...తెలియకుండానే ఒక్కో నెల వేగంగా గడిచిపోతుంది..మళ్లీ డిసెంబర్ వచ్చేస్తుంది. అయితే... మనం ప్రతి ఏడాదీ ఒకేలా జీవితాన్ని గడపలేం. కొన్ని నేర్చుకుంటాం. మరికొన్ని మార్చుకుంటాం. కొత్త అలవాట్లు చేసుకుంటాం. పాత  అలవాట్లు వదిలేస్తాం. అలవాట్ల విషయానికి వస్తే...ఆరోగ్యం విషయంలో ఇప్పుడు అంతా చాలా శ్రద్ధ పెడుతున్నారు. బహుశా కరోనాతో వచ్చిన కుదుపు వల్ల అనుకుంట. వ్యాయామం, యోగతో పాటు ఆహారపు అలవాట్లలోనూ మార్పులు వచ్చేశాయి. మళ్లీ మన ముందు తరాల వాళ్లు తిన్న రాగులు, జొన్నలతోపాటు అన్ని తృణధాన్యాలనూ ఈ తరం వాళ్లు తింటున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎంత ముఖ్యమో కరోనా గుణపాఠం నేర్పింది. అందుకే...ఈ ఏడాదంతా "ఆరోగ్య సూత్రాలు" పాటించారు చాలా మంది. అలా అందరూ ఫాలో అయిన ఆ హెల్త్ ట్రెండ్స్‌ ఏంటో ఓ సారి చూద్దాం. 


Health Trends of the Year 2022: 


1. రోగనిరోధక శక్తి పెంచే ఆహారం: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రోగనిరోధక శక్తి ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకోసం మన లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ ఏడాదిలో ఎక్కువ మంది తమ జీవన శైలిని మార్చుకునేందుకే ఓటు వేశారు. మంచి నిద్ర ఉండేలా చూసుకోవడం, మెడిటేషన్ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, జింక్, విటమిన్ C ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నారు. 


2. విత్తనాహారం: విత్తనాలు శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. పచ్చిబఠాణి, బాదం, జీడిపప్పు, పెసలు, కాబులీ చణా లాంటి విత్తనాహారాన్ని ఎక్కువగా తీసుకున్నారు. వీటిలో ఉండే కార్బొహైడ్రేట్‌లు జీర్ణశక్తికి సహకరించడంతో పాటు శరీరానికి ఉత్తేజాన్నీ ఇస్తాయి. అందుకే చాలా మంది ఉదయమే టిఫిన్‌లకు బదులుగా మొలకెత్తిన విత్తనాలు తింటున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు తీసుకోవడమూ పెరిగింది. 


3. ఆకు కూరలు: ఈ ఏడాదిలో ఎక్కువ శాతం మంది ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నారు. వీటితో పాటు ప్లాంట్‌ బేస్డ్ (Plant Based Food) ఆహారాన్నీ ఎక్కువగా తీసుకున్నారు. 2021తో పోల్చితే...2022లో 65% అధికంగా ఈ తరహా ఆహారాన్ని తీసుకున్నట్టు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున పోషకాలు శరీరానికి అందుతాయి. 


4. మద్యానికి దూరం: ఒకప్పుడు మందులో మునిగి తేలిన వాళ్లు కూడా క్రమంగా ఆ అలవాటు మానుకున్నారు. "ఆరోగ్యమే ముఖ్యం" అని కుటుంబం కోసం మద్యం మత్తుకు దూరమయ్యారు. ఎప్పటి నుంచో మానేయాలని ఆలోచనలో ఉన్న వాళ్లు ఈ ఏడాది ఆ నిర్ణయం తీసుకున్నారు. 


5. సోయా పాలు: బర్రెపాలు, ఆవు పాలకు దూరంగా ఉండాలనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ సోయా పాలు. వీటిని నాన్ డెయిరీ మిల్క్ అని పిలుస్తారు. పాలపదార్థాలు పడని వారు పోషకాలు మిస్ అవ్వకుండా సోయా పాలు తాగుతున్నారు. సోయాతో పాటు ఆల్‌మండ్ మిల్క్, 
ఓట్ మిల్క్‌ కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. అందుకే..ఈ ట్రెండ్‌నీ ఫాలో అయ్యారు కొందరు. 


Also Read: Year Ender 2022: 2022లో బాగా గుర్తుండిపోయిన సంఘటనలివే, మొదటి రోజే విషాదం