Goodbye 2022:
వెల్‌కమ్ 2023
మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. సరికొత్త ఆశలతో 2023కి వెల్‌కమ్ చెప్పేందుకు అంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో మార్పులొచ్చాయి. మరెన్నో గుర్తుపెట్టుకునే సంఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని మంచివి ఉన్నాయి. మరికొన్ని బాధ పెట్టినవీ ఉన్నాయి. ఆ కీలక సంఘటనలేంటో ఓ సారి గుర్తు చేసుకుందాం.
Biggest Events of 2022
1. 2022ని చాలా హుషారుగా మొదలు పెట్టిన తొలి రోజే...అంటే జనవరి 1వ తేదీనే అందరినీ బాధ పెట్టే సంఘటన జరిగింది. కొత్త ఏడాదిలో శుభారంభం కోసం మాతా వైష్ణోదేవి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు. ఆ సమయంలోనే కొందరు మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడం వల్ల సిబ్బంది వాళ్లను కంట్రోల్ చేయలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులకు ఈ చేదు వార్త కలిచి వేసింది.
2. ఆ తరవాత ఫిబ్రవరిలోనూ ఈ విషాదం కొనసాగింది. భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్ (92) ఫిబ్రవరి 6వ తేదీన తుదిశ్వాస విడిచారు. సంగీత సామ్రాజ్యంలో మహారాణిగా వెలుగొందిన ఆమె మరణం ఎంతో మంది అభిమానులను కంటతడి పెట్టించింది. ముంబయిలోని
ఆసుపత్రిలో చాలా రోజుల పాటు అనారోగ్యంతో పోరాడి చివరకు కన్నుమూశారు లతాజీ. సంగీతాభిమానులకు ఈ ఏడాదిని ఓ చేదు జ్ఞాపకంగా మిగిల్చి వెళ్లారు.
3.ఇక రాజకీయాల పరంగా చూస్తే...ఈ ఏడాది అన్ని పార్టీలకు అత్యంక కీలకమైంది. ఏడాది మొదట్లోనే మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికల యుద్దం చాలా ఉత్కంఠగా సాగింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా,
మణిపూర్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చి తన బలాన్ని నిరూపించుకుంది. ఒక్క పంజాబ్‌లో మాత్రం ఆప్ విజయ కేతనం ఎగరేసింది. బీజేపీ విజయ ప్రస్థానంలో 2022 గుర్తుంచుకోదగిందే. ఇక ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఎన్నికలు జరగ్గా...గుజరాత్‌లో బంపర్
మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వశమైంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్‌కు...ఈ విజయం కాస్త ఊతమిచ్చింది.
4. రాజకీయాల్లోనే మరో కీలక పరిణామమూ చోటు చేసుకుంది. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 24 ఏళ్ల తరవాత ఈ అరుదైన ఘనత సాధించారు మల్లికార్జున్ ఖర్గే. ఎన్నో నాటకీయ పరిణామాల తరవాత శశిథరూర్, ఖర్గే మధ్య అధ్యక్ష పోటీ జరగ్గా...ఆ పదవి ఖర్గేను వరించింది. దళిత వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గేను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం ద్వారా కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించింది కాంగ్రెస్. కాకపోతే...అది పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతుందనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే గుజరాత్‌లో ఘోర పరాభవం చవి చూసింది కాంగ్రెస్. అయితే...ఇప్పుడిప్పుడే ప్రియాంక గాంధీ, ఖర్గే నేతృత్వంలో బలోపేతమ య్యేందుకు ప్రయత్నిస్తోంది.
5. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది...శ్రద్ధ హత్య కేసు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో సహజీవనం చేసి...చివరకు ఆ వ్యక్తి చేతుల్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురైంది శ్రద్ధ. ప్రస్తుతం విచారణ వేగంగా కొనసాగుతోంది.