CS Somesh Kumar On Floods : భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ గోదావరిలో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నందున అన్ని ప్రభుత్వ విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేసేలా అదనపు కంటింజెంట్ ప్లాన్ రూపొందించాలన్నారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసిందన్నారు. గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో భద్రాచలం వద్ద రేపటికి నీటి మట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అన్నారు. ముంపునకు గురయ్యే అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఇప్పటి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టాన్ని అరికట్టడంపై ఆయన అభినందించారు.
Also Read : Minister KTR : నర్మాల జలాశయాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్, గంగమ్మ తల్లికి పూజలు
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
జేసీబీలు, జనరేటర్లు, ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రిని అదనంగా కొనుగోలు చేసి, వాటిని వ్యూహాత్మక పాయింట్లలో ఉంచాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వరద బాధిత జిల్లాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సహాయ, పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు తదితర పరికరాలను జిల్లాలకు పంపుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
Also Read : Bhadrachalam Godavari Floods : భద్రాచలం వద్ద ఉగ్రగోదావరి, వంతెనపై రాకపోకలు బంద్
Also Read : Minister Gangula: ముంపు ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన.. నేనున్నానంటూ బాధితులకు భరోసా!