మోమోలు తయారు చేసిన దీదీ


పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. మొన్నటికి మొన్న పానీపూరీ తయారు చేసి పిల్లలకు సర్వ్ చేసినా ఆమె, ఇప్పుడు మోమోస్ తయారు చేశారు. డార్జ్‌లింగ్‌లో రోడ్‌సైడ్ షాప్‌లో తన కుకింగ్ స్కిల్స్‌ని చూపించారు దీదీ. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో మమతా బెనర్జీ నింపాదిగా కూర్చుని ఓ షీట్‌పై మోమోస్‌ని తయారు చేస్తూ కనిపించారు. అక్కడే ఉన్న మహిళలతోనూ ఆమె చాలా సేపు మాట్లాడారు. స్వయం సహాయక గ్రూప్‌ల్లోని మహిళలతో చర్చించారు. "ఇవాళ నేను మార్నింగ్ వాక్‌కి వచ్చినప్పుడు రోడ్‌సైడ్ షాప్‌లో మోమోస్ తయారు చేశాను. ఆ మహిళలతో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది. ఇలా శ్రమించే ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నాను" అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు దీదీ.





 


గతంలోనూ ఇదే విధంగా సర్‌ప్రైజ్ చేసిన మమతా..


మూడు రోజుల డార్జ్‌లింగ్ పర్యటనకు వచ్చిన మమతా బెనర్జీ గత వారం పానీపూరీ తయారు చేస్తూ సందడి చేశారు. రోడ్‌సైడ్ స్టాల్‌లో స్వయంగా తానే గోల్‌గప్పాలు తయారు చేసి పిల్లలకు అందించారు. ఈ వీడియోనూ టీఎమ్‌సీ ట్విటర్‌లో పోస్ట్ చేయగా..వైరల్ అయింది. కొందరు పిల్లలు స్టాల్ వద్ద ప్లేట్‌లు పట్టుకుని నిలబడి ఉండగా, ఒక్కొక్కరికీ వరుస పెట్టి అందించారు దీదీ. గూర్ఖాల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు డార్జ్‌లింగ్ వచ్చారు మమతా బెనర్జీ. "మమతా బెనర్జీ ఓ ఫుడ్‌స్టాల్‌కు వెళ్లారు. అక్కడి మహిళలతో ముచ్చటించారు. ఇక్కడి ప్రజలకు ఎంతో ఇష్టమైన మోమోస్‌ని తయారు చేశారు" అని టీఎమ్‌సీ ట్వీట్ చేసింది. మార్చ్‌లోనూ ఇదే విధంగా ఇక్కడికి వచ్చి మోమోస్ తయారు చేశారు దీదీ. 2019లో దిగా నుంచి కోల్‌కతాకు వచ్చే దారిలో ఓ టీ స్టాల్‌ దగ్గర ఆగి, అందరికీ వేడివేడి టీ తయారు చేసి స్వయంగా సర్వ్ చేసి స్థానికులను ఆశ్చర్యపరిచారు.