Kurnool Travels Bus Accident | హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర వి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ దుర్ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లు టెర్రరిస్టులేనని వ్యాఖ్యానించారు.
ఒక్కరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను బలి తీసుకుంది!.
కేవలం ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 20 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలి కావాల్సి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారితో పాటు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న మానసిక క్షోభ గురించి ఆయన ప్రస్తావించారు. మద్యం మత్తులో డ్రైవ్ చేసేవాళ్లు మానవ బాంబులు అని ఘాటుగా స్పందించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి, ఇతరుల ప్రాణాలను తీసేవారిని ఉద్దేశించి సజ్జనార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు... చెప్పండి? అని ఆయన ప్రశ్నించారు. మీ జల్సా కోసం ఇతరుల ప్రాణాలు తీస్తారా? మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల సంభవించే నష్టాన్ని, దాని వెనుక ఉన్న సామాజిక బాధ్యతారాహిత్యాన్ని సజ్జనార్ ఎత్తి చూపారు.
సమాజంలోని టెర్రరిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండండి
మద్యం సేవించి డ్రైవ్ చేసే వారిని సమాజంలో మన చుట్టే తిరిగే టెర్రరిస్టులు, మానవ బాంబులుగా అభివర్ణించిన సజ్జనార్.. ప్రజలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వారి కదలికలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే డయల్ 100 కి గానీ, లేదా స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది కనుక ఇలాంటివి నివారించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరమో సజ్జనార్ స్పష్టం చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున విషాదం..
శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పల్సర్ బైకును ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి బస్సులోని 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు-చెట్లమల్లాపురం మధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో 13 మంది యువతీ యువకులే ఉన్నారు. డీఎన్‌ఏ పరీక్షలు చేసిన అనంతరం మృతదేహాలను ఆయా కుటుంబాలకు అప్పగిస్తున్నారు.