DJs Banned In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేలా పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా శబ్ధ కాలుష్యానికి కారణమవుతోన్న డీజేలపై (DJs) నిషేధం విధించింది. ఈ మేరకు నగర సీపీ సీవీ ఆనంద్ (CV Anand) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయల్ 100కి ఫిర్యాదులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డీజేల అంశంపై ఇటీవల బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజాసింగ్, పాషాఖాద్రీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ సీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


రెండేళ్లుగా డీజేలపై పెద్దఎత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం దీన్ని గమనించి ఆరా తీశారని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పాషాఖాద్రీ డీజేలపై నిషేధానికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ ఎక్విప్‌మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు చెప్పారు.


ఇవీ నిబంధనలు


రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకూ డీజేలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో అనుమతించనున్నారు. ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో అనుమతిస్తామని.. దీనికి కూడా పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. అలాగే, మతపరమైన ర్యాలీల్లో బాణాసంచా నిషేధమని తెలిపారు. మతపరమైన ర్యాలీలో ఎలాంటి డీజేను ఉపయోగించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


కాగా, 4 జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబిల్స్ నిర్దేశించారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టంలో వాడకూడదని చెప్పారు. రాత్రి వేళల్లో 45 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టమ్‌లో వాడకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని చెప్పారు. పదే పదే రూల్స్ బ్రేక్ చేస్తే ప్రతి రోజూ రూ.5 వేల జరిమానా విధిస్తామని సీపీ వార్నింగ్ ఇచ్చారు.


Also Read: Attack On KTR Vehicle : ముషీరాబాద్‌లో కేటీఆర్ కారుపై దాడి - క్షమాపణలు చెప్పాలని ఆందోళనకారుల డిమాండ్ - అసలు గొడవ అదే