Revanth Reddy : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి ఈడీ దాడులు చేయిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ కేసులకు భయపెట్టి ముఖ్య నాయకులను బీజేపీలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే ఉద్దేశంతో మూసేసిన కేసులను బీజేపీ మళ్లీ తిరగదోడుతుందన్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై రేవంత్ మండిపడ్డారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా ఆమెను విచారణ పేరుతో వేధించారన్నారు. అయినా భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు ఈడీ నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో జోడో యాత్రను అడ్డుకోవడానికి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలిచిందని ఆరోపించారు. ఏయే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉందో అక్కడి నేతలను ఈడీ వేధిస్తుందని రేవంత్‌ అన్నారు. ఈడీ బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌గా మార్చుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 


బీజేపీ చందాలిచ్చిన నేతలపై కేసులేవి? 


గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.కోటి చందా ఇచ్చినందుకు ఐదుగురు నేతలకు నోటీసులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ నేతలను భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. బీజేపీకి చందాలిచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో బీజేపీకు రూ.4841 కోట్ల డోనేషన్ వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు.


ఈడీ కేసులతో వేధింపులు 


కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీచేయడం వెనుక కుట్రను ప్రజలు గమనించాలని రేవంత్‌ రెడ్డి కోరారు. కాంగ్రెస్‌లో చేరాలనుకున్న వాళ్లను భయపెట్టి బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులపై ఈడీ విచారణ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మనోధైర్యాన్ని ఈడీ, ఐటీ, సీబీఐ దెబ్బతీయలేవని రేవంత్ రెడ్డి అన్నారు. 11 రాష్టాల్లో ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపిస్తు్న్న బీజేపీ, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. బంగారు కూలీ పేరుతో కోట్ల రూపాయలు టీఆర్ఎస్ వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కు రూ.800 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. దిల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో టీఆర్ఎస్ ఆఫీస్ కు స్థలం కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో టీఆర్ఎస్ దిల్లీలో స్థలం ఇచ్చారన్నారు. 


Also Read : KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!


Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే