Chandrababu Tweet  : స్కూల్ పిల్లలల వరకూ గంజాయి వచ్చేసిందంటే పరిస్థితి ఎంత ప్రమాదంగా ఉందో అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. 13 ఏళ్ల పిల్లలు గంజాయి సేవిస్తున్న ఘటనలు వెలుగుచూడడం బాధకరమన్నారు. గంజాయి సరఫరాను అరికట్టేలా ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని, ఇది క్షమించరాని నేరమని ఆక్షేపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.  రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటైపోయిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. 13 ఏళ్ల బాలికలు విజయవాడలో గంజాయి తాగడం తనను నివ్వెరపరిచిందని చంద్రబాబు అన్నారు. ఈ ఘటన తనను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురిచేసిందన్నారు. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే పరిస్థితిని తీవ్రంగా భావించి ప్రభుత్వ వ్యవస్థలు సీరియస్‌గా దృష్టిపెట్టాలి. 






ఎన్సీబీ రిపోర్టులో ఏపీ టాప్


దేశవ్యాప్తంగా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందంటూ ఇటీవల మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీన్ని ఏపీ పోలీసులు నిర్వహిస్తున్న ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఖండించింది. ఏపీలో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) నివేదిక-2021 పేర్కొంది. ఈ విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో 26.75 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో పొరుగు రాష్ట్రం ఒడిశా (1,71,713 కిలోలు) ఉంది. దేశంలో స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయిలో 50 శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనిదే. ఏవోబీలో పెద్ద ఎత్తున గంజాయిని సాగు చేస్తూండటమే దీనికి కారణం.


ఏపీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు


ఎన్‌సీబీ రిపోర్టుతో ఏపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గత ఏడాది ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దొరుకుతున్న గంజాయి కేసులు వెలుగు చూశాయి. పలువురు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతోందని అన్నారు. ఈ అంశంపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని గంజాయి స్మగ్లింగ్‌లో అధికార పార్టీ నేతల హస్తం ఉందని విపక్ష నేతలు ఆరోపణలు ప్రారంభించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేక్ న్యూ్స్ ప్రచారం చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ ఏపీ తెలిపింది. అయితే ఫ్యాక్ చెక్ ఏపీ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రిపోర్టు గురించి ప్రస్తావించలేదు.


Also Read : Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !


Also Read : AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?