CLP Meeting: హైదరాబాద్  తాజ్ దక్కన్ హోటల్ లో సీఎల్పీ సమావేశం(CLP Meeting) జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,  ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, వీరయ్య, జగ్గారెడ్డి, సీతక్క, షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, చిన్నారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. 


సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం : ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  


బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్(Congress) అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(MP Uttam Kumar Reddy) అన్నారు. గవర్నర్ ప్రసంగం(Governor Speech) రద్దు చేయడం సరైన విధానం కాదన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) అహంకారానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో, పార్లమెంట్ లో కాంగ్రెస్ ప్రస్తావిస్తుందన్నారు. దళిత బంధు(Dalita Bandhu) సక్రమంగా అమలు చేయాలని ఉత్తర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నా కేసీఆర్ ఇప్పటికైనా బడ్జెట్ లో కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు(Early Elections) వస్తాయని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కర్ణాటకతో పాటు తెలంగాణ(Telangana)లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. నేతలందరూ నియోజకవర్గాలకు వెళ్లాలన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయ్యాలో సోనియా గాంధీ నిర్ణయిస్తారన్నారు. 


'రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయాలి. రేషన్ ద్వారా సన్న బియ్యం అందజేయాలి. కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర, పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడం 'లేదు. ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ అక్రమాలు పెరిగిపోయాయి. వీటిపై సభలో నిలదీస్తాం.' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 


గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : భట్టి విక్రమార్క 


సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నించాల్సిన ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేశాం. ప్రజా సమస్యలు విస్తృతంగా చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వం తూ.తూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు జరపాలని ప్రయత్నిస్తోంది. గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సభ పొరోగ్ జరగలేదని చెప్పడం సంప్రదాయానికి పూర్తి విరుద్ధం. ఇన్ని రోజులు పొరోగ్ చేయలేదంటేనే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. గవర్నర్ ప్రసంగం లేకపోవడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమే. గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అవకాశం ఉండేది. అది మేము కోల్పోయామని భట్టి విక్రమార్క అన్నారు. 


ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయ్ కాట్ 


ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jaggareddy) సీఎల్పీ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. తనకు గతంలోనూ, ఇప్పుడు అనేక చేదు అనుభవ అన్యాయాలు జరిగాయని ఎమ్మెల్యే అన్నారు. అందుకు నిరసనగా సీఎల్పీ భేటీని బహిష్కరించానని చెప్పారు.