Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక ప్రచారంపై కాంగ్రెస్ ఎంపీ, స్టార్ కాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చిచెప్పేశారు. ప్రచారానికి హోంగార్డులు ఎందుకు, ఎస్పీ స్థాయి వాళ్లే వెళ్తారని స్పష్టం చేశారు. తాను ప్రచారానికి వెళ్లనని పరోక్షంగా చెప్పారు కోమటిరెడ్డి. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడులో తన లాంటి హోమ్‌గార్డ్స్ ప్రచారం అవసరం లేదని, ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. వంద కేసులు పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఓ నేత చెప్పారు, ఆయనే మునుగోడు ఉపఎన్నికల్లో గెలిపిస్తారంటూ రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తనతో ఏం పనిలేదన్నారు. తాను విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం చేశారని, తానెప్పుడు విదేశాలకు వెళ్లేది కేటీఆర్‌ను అడగాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీవారి తనపై విమర్శలు చేసే స్థాయి కాదన్నారు.
రేవంత్ రెడ్డికి చురకలు
మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలందరూ మునుగోడు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ కుమ్మలాటలతో ప్రచారంలో వెనుకబడింది. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్తారని కాంగ్రెస్ నేతలు ముందునుంచి చెప్పుకొచ్చారు. కానీ వెంకటరెడ్డి చివరి నిమిషంలో షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలను మరోసారి గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి చేసిన హోంగార్డు వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మునుగోడు ప్రచారానికి తాను వెళ్లడంలేదన్నారు. తనది హోంగార్డు స్థాయి అని, ఎస్పీ స్థాయి వాళ్లే మునుగోడు ప్రచారానికి వెళ్తారని రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండడంతో తమ్ముడికి వ్యతిరేకంగా వెంకటరెడ్డి ప్రచారం చేస్తారా? అనే ఉత్కంఠకు ఇవాళ తెరదించారు.