ఆడవాళ్ళు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య పగిలిన మడమలు. కొన్ని సార్లు ఇవి బాధకరమైన నొప్పి కలిగిస్తాయి. సాధారణంగా డెడ్ స్కిన్ సేల్స్ పేరుకుపోవడం, పొడి బారిపోవడం వల్ల ఇలా మడమలు పగుళ్లు ఏర్పడతాయి. ఇలా వచ్చినప్పుడు మడమలు గట్టిగా అయిపోయి మృదుత్వాన్ని కోల్పోతాయి. చలికాలం వచ్చిందంటే చాలు మడాలు పగిలిన బాధ ఎక్కువగా ఉంటుంది. చలి కారణంగా పగిలిన ప్రదేశంలో నొప్పి అధికంగా ఉండి తీపులు పుడతాయి. మట్టిలో పని చేసే వాళ్ళకి ఇది సాధారణంగా కనిపిస్తుంది. పగిలిన ప్రదేశంలో మట్టి కూరుకుపోవడం వల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ కి దారి తీసే అవకాశం ఉంది.
పగిలిన మడమల సమస్య నుంచి బయట పడేందుకు ఇప్పుడు మార్కెట్లో ఎన్నో చర్మ సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రాసుకోవడం వల్ల పగుళ్లు తగ్గిపోయి మృదువైన చర్మం పొందుతారు. కానీ వాటికి బదులుగా ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా పగుళ్ళకి చెక్ పెట్టవచ్చు. ఈ ఇంటి నివారణ చిట్కాలతో బాధకరమైన పగిలిన మడమలకి చికిత్స చేసుకోవచ్చు.
కొబ్బరి నూనె: ఇది చాలా సమస్యల్ని నయం చేసే గొప్ప పదార్థం అనే చెప్పాలి. చర్మ సమస్యలకి ఇది అన్నీ విధాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె మాయిశ్చరైజింగ్ తో పగిలిన మడమలకి మర్దన చేసుకోవడం వల్ల వాటిని నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమగా ఉంటుంది. స్కిన్ పొడిబారకుండా చూస్తుంది.
తేనె: తేనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా చర్మానికి గొప్ప మాయిశ్చరైజింగ్ గా పని చేస్తుంది. గోరు వెచ్చని నీళ్ళలో తేనె కలిపి ఆ నీటిలో పాదాలని కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత పాదాల నుంచి డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయేలా స్క్రబ్ చేస్తే సరిపోతుంది.
ఎక్స్ ఫోలియేట్: శరీరం మాదిరిగానే చర్మాన్ని కూడా ఎక్స్ ఫోలియేట్ చెయ్యడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. మడమల దగ్గర ఏర్పడిన గట్టి చర్మాన్ని ఇది మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.
మాయిశ్చరైజర్: పాదాలు ఎప్పుడు తేమగా ఉంచుకోవడం చాలా అవసరం. పొడిబారిపోతే మడమలు పగుళ్లు ఏర్పడతాయి. అందుకే ఎప్పటికప్పుడు మాయిశ్చరైజింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉండేందుకు సహాయపడుతుంది.
ఇవే కాదు అరటి పండు గుజ్జు కొద్దిసేపు పగిలిన పాదాలకి రాసుకోవాలి. కాసేపు ఉంచిన తర్వాత దాన్ని శుభ్రం చేసుకున్న పాదాలు బాగుంటాయి. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుని పాదాలు నానబెట్టిన మృదువుగా తయారవుతాయి. నువ్వుల నూనెతో రాత్రి పడుకునే ముందు కొద్దిగా రాసుకుని మర్దన చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
మహిళలు ఇంటి పనుల్లో పడి పాదాల మీద శ్రద్ధ తక్కువగా చూపిస్తారు. అటువంటి వాళ్ళు ఎక్కువగా పగుళ్ళ సమస్య ఎదుర్కొంటున్నారు. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఆ మిశ్రమంలో పాదాలు 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పగుళ్ళ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పొడి దగ్గు నిరంతరం వస్తుందా? కోవిడ్ దగ్గు ఏమో పరీక్షించుకోండి