కరోనా మహమ్మారి పూర్తిగా సమసిపోలేదు. ప్రతిరోజు కొందరు కోవిడ్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు శీతాకాలం వచ్చేస్తోంది. జలుబు, ఇన్ఫెక్షన్స్ తో పాటు కోవిడ్ బారిన కూడా పడే ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ జలుబు, కోవిడ్ 19 లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. దగ్గు, జ్వరం, అలసట, కండరాల నొప్పులు ఫ్లూ లేదా కోవిడ్ లక్షణాలు కూడా. జలుబు, ఫ్లూ, కోవిడ్ కి కారణమయ్యే వైరస్ లు ఒకే విధంగా వ్యాపిస్తాయి. ఇవి రెండు కూడా అంటూ వ్యాధులే. వ్యాధి బారిన పడిన వ్యక్తి ముక్కు, నోటి తుంపర్ల ద్వారా ఎదుటి వారికి సోకుతుంది.
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరగా ఉంటే అది ఎదుటి వారికి కూడా అంటుకుంటుంది. ఒక్కోసారి కరోనా సోకిన వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు కూడా కనిపించపోవడం గందరగోళానికి గురి చేస్తుంది. సాధారణంగా జలుబు చేసినప్పుడు దగ్గు కూడా వస్తుంది. అయితే కరోనా సోకినప్పుడు కూడా దగ్గు రావడం సహజం. ఈ రెండింటిలో ఉండే దగ్గు లక్షణం వల్ల జలుబు లేదా కరోనా బారిన పడ్డారా అనేది తెలుసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. మీకు వస్తుంది కోవిడ్ దగ్గు లేదా జలుబు దగ్గు అనేది తెలుసుకునేందుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ దగ్గు గుర్తించే లక్షణాలు
పొడి దగ్గు: గొంతులో తడి ఆరిపోయినట్లుగా ఉండి పొడి దగ్గు వస్తుంది. ఇది కోవిడ్ దగ్గు అనేందుకు ప్రధాన లక్షణం. గొంతులో ఏదో గుచ్చుకుంటునట్లుగా అనిపిస్తుంది.
నిరంతరం వస్తుంది: కోవిడ్ వల్ల వచ్చే దగ్గు నిరంతరంగా వస్తూనే ఉంటుంది. ఇది కఫం లేకుండా ఉంటుంది. ఎక్కువ సమయం పాటు దగ్గు ఉంటుంది.
తీవ్రత: కోవిడ్ దగ్గు ఎక్కువ కాలం ఉండటంతో పాటు కాలక్రమేణా దాని తీవ్రత పెరుగుతుంది. సాధారణ దగ్గులో తీవ్రత ఎక్కువగా ఉండదు.
బాధకరమైనది: కోవిడ్ పొడి దగ్గు బాధాకరంగా ఉంటుంది. దగ్గేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
శ్వాస తీసుకోవడం కష్టం: దగ్గు కారణంగా అలిసిపోయినట్లుగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.
దగ్గు తగ్గకుండా నిరంతరంగా వస్తూ ఉండటంతో పాటు ఇతర కోవిడ్ లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ సోకి తగ్గిన వ్యక్తుల్లో కూడా వాటి లక్షణాలు తాలూకు బాధ దీర్ఘకాలికంగా ఉంటుందని ఇప్పటికే కొన్ని నివేదికలు వెల్లడించాయి. కోవిడ్ కొత్త వేరియంట్లు వస్తూనే వాటి లక్షణాలు కూడా మారుస్తూ వస్తున్నాయి.
జ్వరం, రుచి, వాసన కోల్పోవడం, జలుబు గతంలో కోవిడ్ లక్షణాలుగా చెప్పే వాళ్ళు. కానీ ఇప్పుడు గొంతు నొప్పి, నిద్రలేమి సమస్య కూడా ఒమిక్రాన్ వేరియంట్ కొత్త లక్షణంగా కొత్త అధ్యయనాలు చెప్పుకొచ్చాయి. గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు నిర్లక్ష్యం వహించకుండా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. వాటి నుంచి రక్షణగా ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు బయట నుంచి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులు శానిటైజ్ చేసుకోవాలి. వ్యక్తిగత శుభ్రంతోనే వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పెరుగు ఇలా తినకూడదు అని చెబుతున్న ఆయుర్వేదం