Congress Leaders Met DGP : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు డీజీపీ అంజనీ కుమార్ ను సోమవారం కలిశారు.  12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు , నాగర్ కర్నూలులో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతల దాడుల అంశాలపై కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనపై డీజీపీ ఫిర్యాదు చేశామన్నారు. ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై దూషణలు, దాడులకు దిగారని తెలిపారు.గొంతుపై కాలు పెట్టి తొక్కి పరుష పదజాలంతో దూషించారని ఆరోపించారు. దాడికి గురైన బాధితుల్లో ఒకరు గిరిజనుడు, మరొకరు దళితుడని తెలిపారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని అనుకున్నామని, కానీ మా నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిపైనే అక్రమ కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం, పోలీసుల బరితెగింపు చర్య అని మండిపడ్డారు.


12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆందోళనలు 


"నాగర్ కర్నూల్ ఘటనపై ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేశాం. 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మరో ఫిర్యాదు కూడా ఇచ్చాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆ నలుగురు ఎమ్మెల్యేలతోపాటు మిగతా వారిపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని కోరాం. ఆధారాలతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డీజీపీని కోరాం. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీని అపాయింట్ మెంట్ కోరితే తప్పించుకు తిరుగుతున్నారు. చీఫ్ సెక్రటరీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు సీఎస్ వత్తాసు పలుకుతున్నట్లు కాంగ్రెస్ భావించాల్సి వస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల 12 నియోజకవర్గాల్లో సంక్రాంతి తరువాత కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది.
నాగర్ కర్నూల్ లో దాడులకు నిరసనగా ఈ నెల 17న దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాలపై స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తాం. మాకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలకు సీఎస్ వత్తాసు పలుకుతున్నారు." - రేవంత్ రెడ్డి 






ప్రజాస్వామ్యమా?  నియంత పాలనా?


నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తప్పుబట్టారు. ప్రాజెక్టును చూడడానికి వెళితే కూడా దౌర్జన్యం చేస్తారా? అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేసేందుకు బీఆర్ఎస్ నాయకుల కుట్ర చేశారని, కాంగ్రెస్ కార్యకర్త మెడపై కాలు పెట్టి తొక్కుతున్న దృశ్యం రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ నెల 7న  మార్కండేయ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకులు అధికార బలంతో దౌర్జన్యం చేసి దాడులు చేశారని మల్లు రవి ఆరోపించారు. మెడపైన కాలుతో తొక్కి హత్య చేసునందుకు కుట్ర చేశారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ  దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెంటనే దోషులపై చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలు కాపాడాలని, బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.