Jadeja on Umran Malik:  శ్రీలంకతో 2-1 టీ20 సిరీస్ విజయంతో టీమిండియా కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని యువ భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అందివచ్చిన అవకాశాలను కొందరు కుర్రాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. ఈ సిరీస్ లో భారత్ కు కొన్ని సానుకూలాంశాలు కనిపించాయి. శివమ్ మావి అద్భుత అంతర్జాతీయ అరంగేట్రం, రవీంద్ర జడేజా గైర్హాజరీలో అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ ప్రదర్శన, బ్యాట్ తో సూర్యకుమార్ ఆధిపత్యం కొనసాగింపు. 


ఈ సిరీస్ లో కొందరు యువ ఆటగాళ్లు భారత్ తరఫున అరంగేట్రం చేశారు. అందులో ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి అద్భుత ప్రదర్శన చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్ లోనే 4 వికెట్లు సాధించాడు. తొలి టీ20లో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అలాగే రవీంద్ర జడేజా స్థానంలో చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. బ్యాటుతో, బంతితో, ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ గతేడాది ఫాం ను కొనసాగించాడు. తొలి టీ20లో విఫలమైనప్పటికీ రెండో టీ20 అర్ధశతకం సాధించాడు. మూడో వన్డేలో అయితే ఏకంగా సెంచరీ బాదేశాడు. 


అత్యధిక వికెట్ల వీరుడు


వీరు ముగ్గురే కాక మరో ఆటగాడు ఈ సిరీస్ లో అందరీని ఆకట్టుకున్నాడు. అతనే భారత యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్. ఉమ్రాన్ ఈ సిరీస్ లో 11 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు తీశాడు. శ్రీలంకతో సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అంతేకాక రెండో టీ20లో 155 కి.మీ. వేగవంతమైన బంతిని సంధించి భారత తరఫున అత్యంత వేగవంతమైన బంతి వేసిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మాలిక్ ప్రదర్శనపై అన్నివైపుల నుంచి ప్రశంసలు దక్కాయి. మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు ఉమ్రాన్ ప్రదర్శనను అభినందించారు. ఇప్పుడు ఈ లిస్టులో టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా చేరాడు. 


అతడు ఆటను ముగిస్తాడు


ఉమ్రాన్ మాలిక్ ను భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ తో పోలుస్తూ ప్రశంసించాడు అజయ్ జడేజా. 'ప్రస్తుతం అతను బౌలింగ్ చేస్తున్న విధానం, రనప్ ను నేను చాలాకాలంగా భారత క్రికెట్ లో చూడలేదు. చివరిగా శ్రీనాథ్ ను నేను చూశాను. ఇప్పుడు తన బౌలింగ్ యాక్షన్ తో జవగల్ శ్రీనాథ్ ను ఉమ్రాన్ గుర్తుచేస్తున్నాడు.' అని జడేజా అన్నాడు. 'ఉమ్రాన్ మాలిక్ లో ఏదో ప్రత్యేకత ఉంది. కాబట్టి అతన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచించాలి. ప్రత్యర్థి జట్టు లోయరార్డర్ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు ఉమ్రాన్ కు బౌలింగ్ అప్పగించాలి. అప్పుడు 10 లో 8 సార్లు అతను 3 వికెట్లు పడగొట్టి ఆటను ముగిస్తాడు.' అని అజయ్ జడేజా అన్నాడు.