CM KCR : తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సోమవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తుంది. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన వజ్రోత్సవాలలో జాతీయ పతాకాన్ని సీఎం ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేస్తుంది. ఆగస్టు 22న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.
గ్రామ గ్రామాన స్వతంత్ర వేడుకులు
వజ్రోత్సవ వేడుకల ప్రారంభించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ఎన్నో త్యాగాలు, ఆవేదనలతో స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. స్వతంత్ర స్ఫూర్తిని తెలిసేలా ప్రతి గ్రామాన వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. స్వతంత్ర పోరాటంలో మహాత్మాగాంధీ త్యాగాలను మరువలేమన్నారు. అనేక త్యాగాలతో, పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సాధించి 75 సంవత్సరాల స్వయంపాలనతో భారత్ ముందుకుసాగుతుందన్నారు. కొత్త తరాల వారికి భారత స్వతంత్ర పోరాటస్ఫూర్తిని తెలియజేసేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కొత్త తరం వారికి భారత స్వతంత్ర పోరాటాన్ని తెలియజేయడం పాతతరం వారి కర్తవ్యం అని సీఎం కేసీఆర్ అన్నారు.
తొలి పోరాటం సిఫాయిల తిరుగుబాటు
దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనేది అపురూపమైన సందర్భమని సీఎం కేసీఆర్ అన్నారు. భారత స్వాతంత్య్రం సుదీర్ఘమైన పోరాటమని చెప్పారు. సుమారు 150 ఏళ్లపాటు కొనసాగిన పోరాటమన్నారు. అనేక మంది వివిధ పద్ధతుల్లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా 1857 సిఫాయిల తిరుగుబాటును సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సిఫాయిల తిరుగుబాటును బ్రిటీష్ సైన్యం అణచివేసినా నిరుత్సాహ పడకుండా పోరాటం సాగించారన్నారు. అదే స్ఫూర్తితో వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని పోరాటాన్ని కొనసాగించారన్నారు. బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో అనేక సాంస్కృతిక పోరాటాలు జరిగాయన్నారు. లాలాలజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్ ఇలా అనేక మంది స్వతంత్ర పోరాటాలు చేశారన్నారు. ఝాన్సీ లక్ష్మీభాయి, ఎన్నో సంస్థానాలు ఒకటై పోరాటం చేశాయని సీఎం కేసీఆర్ అన్నారు.
అహింస సిద్ధాంతమే ఆయుధం
బారిష్టర్ చదువుకుని, గొప్ప అడ్వకేట్‌గా పేరు సంపాధించిన మహాత్మా గాంధీ స్వతంత్ర సమరానికి నాయకత్వం వహించారని సీఎం కేసీఆర్ అన్నారు. దక్షిణాఫ్రికాలో జాతివివక్ష, అనేక విషయాలపై పోరాటం చేశారన్నారు. భారతీయులు కూడా ఇలానే అణచివేతకు గురవుతున్నారని పోరాటం చేసేందుకు గాంధీ భారత్‌కు వచ్చారని కేసీఆర్ గుర్తుచేశారు. భారతదేశ స్వతంత్ర పోరాటానికి గాంధీ నాయకత్వం వహించారన్నారు. ప్రపంచానికి అహింస అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారన్నారు. కానీ నేడు మహాత్మాగాంధీని కించపరిచేలా ప్రవరిస్తున్నారన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు కూడా గాంధీ స్ఫూర్తితోనే తాను అధ్యక్షుడు అయ్యానని తెలిపారన్నారు. భారత్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలన్నారు.