CM KCR : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులను వేధించారన్నారు. కవితను అరెస్టు చేస్తారట చేయనివ్వండి ఏం చేస్తారో చూద్దామని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఏంచేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకు వచ్చారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసుల పేరుతో బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. అయినా భయపడే ప్రసక్తే లేదని కేంద్రంపై పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడం చేస్తామని పార్టీ నేతలనుద్దేశించి కేసీఆర్‌ అన్నారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. శనివారం విచారణకు రావాల్సిందిగా కోరింది. ఈ మేరకు రేపు ఉదయం ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అయితే కవితకు మద్దతుగా మంత్రి కేటీఆర్‌ కూడా దిల్లీ బయల్దేరివెళ్లారు. దిల్లీలో న్యాయ నిపుణులతో కేటీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే దిల్లీలోని కవిత నివాసానికి లాయర్ల బృందం చేరుకుంది.  


రేపు ఈడీ ముందుకు కవిత 


 ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ జారీ చేసిన నోటీసుల విషయంలో విచారణకు హాజరయ్యే విషయంలో కవిత సమయం కోరారు.  న్యాయనిపుణులతో సంప్రదించిన తర్వాత తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని 15వ తేదీ తర్వాత హాజరు కాగలనని లేఖ రాశారు. కానీ ఈడీ నుంచి స్పందన లేదు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరే ముందు మరో లేఖ  రాశారు. 11వ తేదీనే విచారణకు హాజరవుతానని ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. దీనికి స్పందించిన ఈడీ 11న విచారణకు హాజరయ్యేందుకు అనుమతి తెలిపింది. 


హైదరాబాద్ కేంద్రంగా దిల్లీ లిక్కర్ స్కామ్ 


దిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.  హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్ జరిగిందని మనీశ్‌ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. శుక్రవారం దిల్లీ కోర్టులో ఆప్ నేత సిసోడియాను ఈడీ అధికారులు  హాజరుపరిచారు. సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను ఈడీ బయటపెట్టడింది. లిక్కర్‌ స్కామ్‌ హైదరాబాద్‌ లోనే ప్లాన్ చేశారని తెలిపింది. దినేష్ అరోరాను సౌత్ గ్రూప్ హైదరాబాద్‌కు పిలిపించిందని, ఐటీసీ కోహినూర్‌లోనే కీలక చర్చలు జరిగాయని ఈడీ రిపోర్టులో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు, దిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఈ విషయం తెలుసని, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.  2021 మార్చి 19, 20 తేదీల్లో విజయ్‌నాయర్‌ని ఎమ్మెల్సీ కవిత కలిశారు. కేజ్రీవాల్‌, సిసోదియా తరఫున విజయ్‌నాయర్‌ పనిచేశారని బుచ్చిబాబు తెలిపారని ఈడీ రిపోర్టులో చెప్పింది. ఇండోస్పిరిట్‌ కంపెనీలో 32 శాతం వాటాను అరుణ్ పిళ్లై పేరుతో కవిత కలిగి ఉన్నారని, కవితకు అనుకూలంగా లిక్కర్ పాలసీలో మార్పులు చేస్తే కొంత అమౌంట్ ఆప్‌కు ఇచ్చేందుకు అవగాహన కుదిరిందన్నారు. ఈ విషయాన్ని బుచ్చిబాబు తన వాంగ్మూలంలో తెలిపారని ఈడీ వెల్లడించింది. 2021 జూన్‌లో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్లో అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, దినేశ్‌ అరోరా భేటీ అయ్యారని చెప్పింది. రూ.100 కోట్ల ముడుపులు ఎలా ఇవ్వాలి, ఎలా దిల్లీకి తరలించాలనే అంశాలపై చర్చించారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. 


12 శాతం లాభం వచ్చేలా 


సౌత్‌ గ్రూప్‌ ద్వారా దినేష్ అరోరా రూ.31 కోట్ల నగదు తీసుకుని, ఆ నగదును ఆప్‌ నేతలకు చేరవేశారు. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో సిసోడియా 14 మొబైల్‌ ఫోన్లు మార్చారు. సీబీఐ దాడుల్లో వాటిలో రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని ఈడీ తన రిపోర్టులో వెల్లడించింది. దిల్లీ లిక్కర్ పాలసీ అధికారికంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకి ఆ వివరాలు చేరాయని తెలిపింది. మద్యం విధానంలో కొన్ని విషయాలను బుచ్చిబాబు ఫోన్ లో గుర్తించామని ఈడీ కోర్టుకు తెలిపింది. మద్యం పాలసీలో 12 శాతం ప్రాఫిట్‌ ఉండేలా మార్చి దానిలో ఆప్‌ నేతలకు 6 శాతం అందించాలని విజయ్‌ నాయర్‌ చెప్పినట్టు దినేష్‌ అరోరా ఈడీ ముందు ఒప్పుకున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. లిక్కర్ పాలసీపై దిల్లీ ఎల్జీ విచారణ చేపట్టాలని ఆదేశించిన రోజే సిసోడియా ఫోన్ మార్చారని ఈడీ తెలిపింది. ఇతరుల పేర్లతో సిమ్‌ కార్డులు వినియోగించారని,  ముడుపుల ద్వారా రూ.100కోట్లు, ఇండోస్పిరిట్స్‌ లాభాల్లో రూ.192 కోట్లు అందాయని ఈడీ తెలిపింది. ముడుపుల విషయంలో సిసోడియా పొంతనలేని సమాధానాలు ఇచ్చారని,  రూ.292.8 కోట్లు దక్కిన వ్యవహారంలో సిసోడియా కీలకమని ఈడీ రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసింది.