KCR On Early Elections :   తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఆలోచనే లేదని సీఎం కేసీఆర్ పార్టీ కార్యవర్గసభ్యులకు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు సమావేశాలు పెట్టుకుని పాదయాత్రలు చేయాలని సూచించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపడుతోందని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ  ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఆవిర్భావ ఉత్సవాలు ఉంటాయని.. వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 


ప్లీనరీ లేదు వరంగల్లో భారీ బహిరంగ సభ                            


ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు కేసీఆర్. ఆ రోజు ప్లీనరీ సమావేశం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని.. ఆ దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉందని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. 


ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేయాలని కేసీఆర్ సూచన                                


ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల్లోనే ఉండాలని.. ప్రతి ఎమ్మెల్యే పాదయాత్ర చేయాలని ఆదేశించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కోరారు కేసీఆర్. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కీలక నేతలకు సూచించారు. అదే విధంగా ఎమ్మెల్యేలు.. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు, సభలు నిర్వహించి ప్రజా సంక్షేమ పథకాలను జనానికి వివరించాలన్నారు.  కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటన తర్వాత ముందస్తు ఎన్నికల విషయంపై ఇప్పటి వరకూ జరిగిన ఊహాగానాలకు తెరపడినట్లయింది. 


కొంత మంది నేతల తీరుపై కేసీఆర్ అసహనం                                         


సమావేశంలో పార్టీ నేతలు కొందరిపై కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా దళిత బంధు పథకం అమలు సమయంలో..లబ్దిదారుల నుంచి వరంగల్, ఆదిలాబాద్‌లలో కొంత మంది పాార్టీ నేతలు డబ్బులు వసూలు చేశారని.. తన వద్ద సమాచారం ఉందని కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. తన వద్ద సమాచారం ఉందని ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.  అలాగే మరి కొంతమంది నేతలు వ్యవహారాలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.