Viveka Murder Case : తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది ఈ కేసు విచారణలో వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టును కోరారు.  విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. గత రెండుసార్లు జరిపిన విచారణ స్టేట్మెంట్స్ పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టాలని అవినాష్ న్యాయవాది కోర్టును కోరారు. రెండుసార్లు సీబీఐ జరిపిన విచారణ ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా జరిగిందన్నారు. రెండుసార్లు విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి నుంచి ఎటువంటి సంతకాలు తీసుకోలేదన్నారు. 40 నుంచి 50 సార్లు అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఎడిట్ చేశారన్నారు. అవినాష్ రెడ్డి సంతకం లేనందున స్టేట్మెంట్లు మార్చి ఉండొచ్చని ఆయన తరఫు న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డే అని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. 


అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ 


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్  చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇందులో చాలా అంశాలను ప్రస్తావించారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే..సీబీఐ విచారణ కొనసాగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ..ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ చూపి సీబీఐ తనను వేధిస్తోందని.. స్పాట్ లో దొరికిన లేఖపై సీబీఐ దర్యాప్తు చేయటం లేదన్నారు.  వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని..  వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని..అదే కోణంలో విచారణ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని, తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని  అవినాష్‌రెడ్డి ఆరోపించారు. నోటీస్ దశలో విచారణ సాగుతుండగా ఛార్జ్ షీట్‌లో నేరస్థుడిగా సీబీఐ చిత్రీకరిస్తోందన్నారు.   


మూడోసారి విచారణ 


సునీత ఫ్యామిలీకి వివేకానందరెడ్డికి విభేదాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. వివేక వేరే పెళ్లి చేసుకోవడంతోనే గొడవలు మొదలయ్యాయని తెలిపారు. వివేకా హత్య జరగక ఐదారేళ్ల ముందు నుంచే వివాదాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ యాంగిల్‌లో సీబీఐ విచారణ చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆరోపణలు అవినాష్ చేసినందునే తన వాదన కూడా వినాలని సునీత కోరనున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే ఈ కేసులో అవినాష్‌ రెడ్డిని రెండుసార్లు విచారించిన సీబీఐ ఇవాళ మూడోసారి విచారిస్తోంది. సీబీఐ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండుసార్లు అవినాష్ రెడ్డిని విచారించారు.