పీపుల్స్ ఫ్రంట్ దేశం కోసమే కానీ ప్రధాని పదవి కోసం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. హిజాబ్‌ వ్యవహారంలో దేశం మొత్తం మౌనం వహిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. కర్ణాటకలో మొదలైన ఈ సమస్య దేశం మొత్తం వస్తే గతేంటి అని ప్రశ్నించారు. బీజేపీ విద్వేష రాజకీయం మానుకోవాలన్నారు. బీజేపీ గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కేసీఆర్ అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ శక్తులను ఏకం చేసి బీజేపీ వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు. దేశం కోసం కొత్త పార్టీ అవసరమైతే పెడతానన్నారు. ప్రజల ఫ్రంట్‌ ప్రధాని పదవి కోసం కాదని దేశం కోసమన్నారు. సైన్యంపై రాహుల్‌  గాంధీ విమర్శలు చేసినప్పడు ఎవరూ మాట్లాడలేదన్న అస్సాం సీఎం వ్యాఖ్యలపై కేసీఆర్‌ స్పందించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ సమాచారాన్ని కేంద్రం బయటపెట్టాలని రాహుల్‌ అడిగారని, అందులో తప్పేముందని వ్యాఖ్యానించారు.  


దేశంలోని వివిధ బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. వాళ్లలో చాలా మంది మోదీ దోస్తులే ఉన్నారన్నారు. బ్యాంకులకు మోసం చేసిన వాళ్లు ఎక్కువ మంది గుజరాత్‌కు చెందిన వారే ఉన్నారన్నారు. అందుకే బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టకపోతే దేశం నాశనమైపోతుందన్నారు. రఫేల్‌ జెట్‌ విమానాల కొనుగోలులో పెద్ద స్కామ్ చేశారని విమర్శించారు. పక్క దేశాలకు చౌకగా అమ్మిన రఫేల్ జెట్ విమానాలను రూ.వేల కోట్లు అధికంగా కొట్టారన్నారు. భారత్ కన్నా చౌకగా ఇండోనేషియా రఫేల్‌ విమానాలు కొనుగోలు చేసిందన్నారు. బీజేపీ అవినీతి గురించి దిల్లీలో పంచాయితీ పెడతానని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ నేతల అవినీతి చిట్టా బయటపెట్టి అందరినీ జైలుకు పంపిస్తామన్నారు. 


కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... ప్రధాని మోదీ చెప్పేదొకటి చేసేదొకటి అని మండిపడ్డారు. విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా డ్రాఫ్ట్ బిల్లును కేంద్రం రాష్ట్రాలకు పంపిందన్న సీఎం కేసీఆర్... ఆ బిల్లుపై పలు రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. ఈ బిల్లును ఆమోదించడానికి ముందే కేంద్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. విద్యుత్‌ సంస్కరణలను తెలంగాణ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామన్నారు. కేంద్రం సంస్కరణలు పేరిట బెదిరింపులకు పాల్పడుతుందని కేసీఆర్ ఆరోపించారు. సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్‌బీఎం అరశాతం ఐదేళ్ల పాటు ఇస్తామన్నారని చెప్పారు. ఈ ముసాయిదా బిల్లుకు ఏపీ అంగీకరించిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 25 వేల వ్యవసాయ మోటార్లు పెట్టారన్నారు. మిగతా విద్యుత్‌ మీటర్లకు రూ.737 కోట్లతో టెండర్లు కూడా పిలిచారన్నారు. 


కేంద్రం చెప్పినట్టు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోతే తెలంగాణ ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. అయినా మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టంగా చెప్పామన్నారు. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయమని కేంద్రం చెప్పినట్టు నిరూపిస్తే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతానని బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ అన్నారు. ఇప్పుడు బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలన్నారు. సాగు కోసం కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకూడదని కేంద్రం చెబుతుందన్నారు. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెస్తుందన్నారు. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తే  లాండ్రీలకు, వస్త్ర పరిశ్రమకు, పౌల్ట్రీలకు, వ్యవసాయానికి, ఎస్సీలకు ఉచిత విద్యుత్‌ సరఫరా నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో తప్ప 24 గంటల విద్యుత్‌ ఏ రాష్ట్రం ఇవ్వటం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ఉద్దేశమన్నారు. బీజేపీకి చందాలు ఇచ్చే సంస్థల సోలార్‌ విద్యుత్‌ కొనాలంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.