Mallu Bhatti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల లొల్లి మొదలైంది. ఏఐసీసీ ఇటీవల ప్రకటించిన కమిటీలపై సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీలపై కొందరు అసంతృప్తిగా ఉన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నేతల అభిప్రాయాలను తాను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్ హనుమంతరావు, గీతారెడ్డి, ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌రావు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిలతో పాటు ఉస్మానియా విద్యార్థి సంఘం నేతలు భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సమావేశంలో తాజా రాజకీయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.


పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత ఇద్దరూ ముఖ్యమే


అనంతరం భట్టి విక్కమార్క మీడియాతో మాట్లాడారు.  పార్టీలో చాలా రోజులుగా పని చేస్తున్నా తమకు అవకాశం రాలేదని కొందరు తన దగ్గర బాధపడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ సీనియర్ నాయకులు పార్టీ పదవులపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఓయూ నాయకులు సైతం తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, అధిష్ఠానానికి తమ అసంతృప్తిని తెలియజేయాలన్నారు. ప్రతిసారి కమిటీల కూర్పులో పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో పాటు ఏఐసీసీ నాయకులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటారన్నారు. కానీ ఈసారి కమిటీల  ఏర్పాటుకు తనను పిలవలేదన్నారు. ఆ విషయం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ను అడగాలన్నారు. పార్టీకి పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత ఇద్దరూ ముఖ్యమే అన్నారు. 


రాజీనామాలు   


 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీల నియామకం కాక రేపుతోంది. తమకు అవకాశం దక్కకపోవడంతో నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు దక్కలేదని ఆదివాసీ జాతీయ నాయకుడు బెల్లయ్య నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అధికార ప్రతినిధి పదవికి ఆయన రాజీనామా చేశారు.  టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ కూడా రాజీనామా చేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితో ఆమె రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన కంటే జూనియర్లకు స్థానం కల్పించారని ఆమె వ్యాఖ్యానించారు. పీసీసీ కమిటీలో తన పేరు లేకపోవడం అవమానించడమేనని కొండా సురేఖ తెలిపారు. కొండా సురేఖ వరంగల్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి వరంగల్ ‌లో కీలక నాయకురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి గతంలో ఆమె మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొండా సురేఖ.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆమెకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు కల్పించారు. తాజాగా శనివారం కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ అసంతృప్తికి గురయ్యారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆమె రాజీనామా చేశారు.