ENG vs PAK 2ND TEST: పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించింది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో 26 పరుగుల తేడాతో పాక్ పై గెలిచింది. రెండో ఇన్సింగ్స్ లో 355 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 102.8 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
పాక్ పై మొదటి టెస్టులో విజయం సాధించిన బెన్ స్టోక్స్ సేన... రెండో మ్యాచులో విజయ ఢంకా మోగించింది. ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్లకు 198 పరుగులతో నాలుగో రోజు ఆటను మొదలు పెట్టిన పాకిస్తాన్ ను ఇంగ్లండ్ బౌలర్లు హడలెత్తించారు. అయితే మొహమ్మద్ నవాజ్ ఒక ఎండ్ లో పాతుకుపోయి బ్యాటింగ్ చేశాడు. సల్మాన్ (20 నాటౌట్)తో కలిసి 6వ వికెట్ కు 80 పరుగులు జోడించాడు. నవాజ్ ను మార్క్ వుడ్ పెవిలియన్ కు చేర్చాడు. జహిద్ మహ్మూద్ (0)ను బౌల్ట్ చేశాడు. 319 పరుగుల వద్ద పాకిస్తాన్ 9వ వికెట్ ను కోల్పోయింది. పాకిస్తాన్ గెలవాలంటే ఆఖరి వికెట్ కు 36 పరుగులు జోడించాల్సి వచ్చింది. ఈ క్రమంలో సల్మాన్ పాక్ విజయం కోసం తీవ్రంగా ప్రతిఘటించాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన రాబిన్సన్, మొహమ్మద్ అలీ (0)ని అవుట్ చేసి ఇంగ్లండ్ ను గెలిపించాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 51.4 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (63), ఓలీ పోప్ (60) అర్ధ సెంచరీలతో రాణించాడు. అబ్రార్ అహ్మద్ 7 వికెట్లతో రాణించాడు. జహిద్ మహ్మూద్ 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్ లో 62.5 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (75), సౌద్ షకీల్ (63) మినహా మిగిలిన ఆటగాళ్లు విఫలం అయ్యారు. జాక్ లీచ్ నాలుగు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 64.5 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (108; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కాడు. బెన్ డకెట్ (79; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. బౌలింగ్ లో అబ్రర్ అహ్మద్ 4 వికెట్లు తీసి సత్తా చాటాడు.