Happy Birthday Yuvraj Singh:  యువరాజ్ సింగ్-  క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమైన పేరు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా, స్పిన్ బౌలర్ గా, చురుకైన ఫీల్డర్ గా టీమిండియాకు దాదాపు 2 దశాబ్దాల పాటు తన సేవలందించాడు యువీ. భారత్ కు సిసలైన ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేడు యువరాజ్ పుట్టినరోజు. 1981, డిసెంబర్ 12న జన్మించిన యువీ నేడు 42వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఈ ఆల్ రౌండర్ పై ప్రత్యేక కథనం...


యువీ.. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే తనేంటో నిరూపించుకునే ఇన్నింగ్స్ ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన యువరాజ్ సింగ్ స్పిన్ బౌలర్ కూడా. బ్యాట్ తోనే కాక ఎన్నోసార్లు తన బౌలింగ్ తో భారత్ కు మ్యాచులు గెలిపించాడు. ఫీల్డింగ్ లో చిరుతలా కదులుతూ ది బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ లో క్యాన్సర్ తో పోరాడుతూ కూడా యువీ ఆడిన ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. దాదాపు 2 దశాబ్దాల పాటు భారత క్రికెట్ కు తన సేవలందించిన యువీ 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 


యువీ కెరీర్ లో ముఖ్యమైన ఘట్టాలు


6 బంతుల్లో 6 సిక్సులు


2007 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సులను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ మ్యాచులో ఇంగ్లిష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు.  మొన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఆ రికార్డును చెరపలేకపోయారు. అయితే భారత దేశవాళీ టోర్నీవిజయ్ హజారే ట్రోఫీ 2022లో రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్సులు కొట్టాడు. ఆ మ్యాచులోనే 12 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేశాడు. టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు అది. ఇప్పటికీ అది అలానే ఉంది. 


2011 వన్డే ప్రపంచకప్


2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ ను టీమిండియా గెలుచుకుంది. ఆ టోర్నీలో యువీ అద్భుత ప్రదర్శన చేశాడు. అప్పటికే తనకు క్యాన్సర్ సోకింది. అయినా కూడా ఆ టోర్నీలో యువరాజ్ సింగ్ 362 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. 2000 లో జరిగిన అండర్- 19 ప్రపంచకప్ లోనూ యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. 


ఐపీఎల్ లో 2 హ్యాట్రిక్స్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రెండుసార్లు హ్యాట్రిక్స్ తీసిన బౌలర్ గా యువీ ఘనత సాధించాడు. 2009లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన యువరాజ్ సింగ్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మరలా ఆ ఏడాది ఐపీఎల్ లోనే డెక్కన్ ఛార్జర్స్ పై హ్యాట్రిక్ అందుకున్నాడు. 2016, 2019లలో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లలో యువీ భాగమయ్యాడు. 


తన అంతర్జాతీయ కెరీర్ లో మొత్తం 398 మ్యాచులో ఆడిన యువరాజ్ సింగ్.. 11వేలకు పైగా పరుగులు సాధించాడు. జీవితంలోనూ క్యాన్సర్ తో పోరాడి గెలిచిన యువరాజ్ సింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు.