Kohli On Cristiano Ronaldo:  ఫిఫా ప్రపంచకప్ 2022లో క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ ఓటమిని తట్టుకోలేని రొనాల్డో మైదానంలోనే భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఓటమిపై తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో భావోద్వేగ లేఖను పోస్ట్ చేశాడు. దీనిపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. రొనాల్డో సాధించిన ఘనతలను ఏ ట్రోఫీ నిర్వచించలేదని, అలాగే ఏ కప్ గెలవలేకపోవడం అనేది అతని విజయాలను తక్కువచేయలేదని పోస్ట్ చేశాడు. 


మీ విజయాలను ఏ టోర్నీ నిర్వచించలేదు


'నా దృష్టిలో మీరు ఆల్ టైమ్ గ్రేట్. మిలియన్ల మందికి  స్ఫూర్తిగా నిలిచారు. ఫుట్ బాల్ క్రీడలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు మీరు చేసిన దాన్ని ఏ ట్రోఫీ లేదా టైటిల్ నిర్వచించలేదు. మీరు వ్యక్తులపై చూపిన ప్రభావాన్ని, మీరు ఆడుతున్నప్పుడు నేను ఇంకా ప్రపంచంలోని అభిమానులు ఏం అనుభూతి చెందారో దాన్ని ఏ కప్ నిర్వచించలేదు. మైదానంలో దిగిన ప్రతిసారి మీరు మనస్ఫూర్తిగా, అంకిత భావంతో ఆడారు. ప్రతి క్రీడాకారునికి మీరు నిజమైన ప్రేరణ. అందుకే నాకు మీరు ఆల్ టైమ్ గ్రేట్' అంటూ రొనాల్డో పోస్టుకు కోహ్లీ బదులిచ్చాడు. 






క్వార్టర్ ఫైనల్ లో పోర్చుగల్, మొరాకో చేతిలో ఓడిపోయింది. దీంతో కెరీర్ లో ఒక్క ప్రపంచకప్ అయినా సాధించాలన్న రొనాల్డో కల చెదిరిపోయింది. 37 ఏళ్ల రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్ అనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇక క్రిస్టియానో ప్రపంచకప్ సాధించడం కలలాగే మిగిలిపోనుంది. ఈ బాధతోనే మ్యాచ్ ఓడిన తర్వాత రొనాల్డో మైదానంలోనే భావోద్వేగానికి గురయ్యాడు. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తర్వాత తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక భావోద్వేగపూరిత లేఖను పెట్టాడు. 


నా అతిపెద్ద కల అదే


తన జట్టు పోర్చుగల్ కు, ప్రపంచకప్ నకు ఆతిథ్యమిచ్చిన ఖతార్ కు రొనాల్డో కృతజ్ఞతలు తెలిపాడు. 'పోర్చుగల్ తరఫున ప్రపంచకప్ గెలవడం నా కెరీర్ లో అతిపెద్ద, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కల. అదృష్టవశాత్తూ నేను నా దేశంతో సహా అంతర్జాతీయ స్థాయిలో అనేక టైటిళ్లను గెలుచుకున్నాను. అయితే పోర్చుగల్ పేరును ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంచడం నా అతిపెద్ద కల. నేను దానికోసం పోరాడాను. 16 ఏళ్లలో నేను ఆడిన 5 ప్రపంచకప్ టోర్నీల్లో గొప్ప ప్రదర్శన ఇచ్చాను. నా దేశం నాకు ఇచ్చిన మద్దతుతో నా సర్వస్వం ఆట కోసం ఇచ్చాను. నేనెప్పుడూ పోరాటం వదులుకోలేదు. అలాగే ఆ కలనూ వదులుకోలేదు.' అంటూ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో రాశాడు.