Sanju Samson Ireland Cricket: భారత యువ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం 27 మ్యాచుల్లోనే ఆడాడు. మొదట నిలకడలేమితో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే గత రెండేళ్లుగా దేశవాళీ టోర్నీల్లోనూ, ఐపీఎల్ లోనూ అదరగొడుతున్నాడు. అవకాశం వచ్చిన ప్రతి మ్యాచులోనూ బాగా ఆడుతున్నాడు. నిలకడగానూ పరుగులు రాబడుతున్నాడు. అయినప్పటికీ బీసీసీఐ అతడిని జట్టులోకి తీసుకోవడం లేదంటూ అభిమానులు విమర్శిస్తున్నారు. వరుసగా విఫలమవుతున్న పంత్ కు మాత్రం ఎన్నో అవకాశాలిస్తూ... ఎంతో ప్రతిభ ఉన్న సంజూను పక్కన పెడుతున్నారని క్రికెట్ అభిమానులు బీసీసీఐను తప్పు పడుతున్నారు. ఈ క్రమంలో సంజూకు వేరే దేశం క్రికెట్ బోర్డు నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తమ దేశం తరఫున ఆడాలంటూ సంజూ శాంసన్ కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని మ్యాచుల్లో అవకాశం కల్పిస్తామన్న నిబంధనతో ఐర్లాండ్ జట్టు.. తమ దేశం తరఫున ఆడాలని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే తాను భారత్ తరఫునే ఆడతానని, అవకాశం ఇచ్చే వరకు వేచి చూస్తానని సంజూ సమాధానం చెప్పినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఆసియాకప్, టీ20 వరల్డ్‌కప్, తాజాగా బంగ్లాదేశ్ టూర్‌కు కూడా సంజూ శాంసన్‌ను బీసీసీఐ ఎంపిక చేయలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో తప్ప మిగతావాటిలో అతడి ఆటతీరు కూడా అంత అభ్యంతరకరంగా లేకపోవడంతో సెలక్టర్ల దృష్టిలో అతడు ఎందుకు పడటం లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంజూ ఇలా... పంత్ అలా
టీ20 ప్రపంచకప్ అనంతరం న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు సంజూ శాంసన్ ను ఎంపిక చేశారు. అయితే ఒక్క వన్డేలోనే తుది జట్టులో అవకాశమిచ్చారు. అందులో సంజూ మంచి ప్రదర్శనే చేశాడు. కీలకమైన సమయంలో శ్రేయస్ అయ్యర్ తో కలిసి మంచి భాగస్వామ్యం అందించాడు. బంతికో పరుగు చొప్పున చేశాడు. అయినప్పటికీ తర్వాతి మ్యాచుల్లో సంజూకు అవకాశం రాలేదు.
మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్ లో వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ కు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కివీస్ పర్యటనలో టీ20, వన్డే సిరీస్ రెండింటిలోనూ పంత్ విఫలమయ్యాడు. అయినప్పటికీ బంగ్లాతో పర్యటనకు పంత్ ను ఎంపిక చేశారు. అయితే వెన్ను నొప్పితో పంత్ వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. అయినప్పటికీ అతని స్థానంలో అయినా సంజూను జట్టులోకి తీసుకోలేదు. ఈ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. టెస్టుల్లో అతని రికార్డులను బట్టి జట్టులో చోటు కల్పిస్తున్నామంటూ టీం మేనేజ్ మెంట్ చెప్తోంది. కోచ్, కెప్టెన్లు కూడా అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.