Kandikonda Yadagiri: ప్రముఖ కవి, గేయ రచయిత  కందికొండ యాదగిరి శనివారం కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కందికొండ గత కొంతకాలంగా క్యాన్సర్(Cancer) వ్యాధితో బాధపడుతున్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన తెలంగాణ(Telangana) బిడ్డ కందికొండ అని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. కందికొండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం దురదృష్టమని సీఎం అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 



రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాటం 


ప్రముఖ సినీ గేయరచయిత కందికొండ యాదగిరి(49)(Kandikonda Yadagiri) కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కీమో థెరపీతో స్పైనల్ కార్డ్ దెబ్బతింది. కొద్ది రోజులుగా ఆరోగ్యం విషమించడంతో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. వెంగళరావు నగర్ లోని తన ఇంట్లో కందికొండ మరణించారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. ఆయన స్వస్థలం నర్సంపేట మండలం నాగుర్లపల్లి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఇంట్రెస్ట్ కారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి(Chakri) కందికొండను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 


తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం 


అయితే ఎక్కువగా పూరి జగన్నాథ్(Puri Jagannadh) కందికొండకి అవకాశాలు ఇచ్చారు. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' సినిమాలో కందికొండ రాసిన 'మళ్లీకూయవే గువ్వా' అనే పాట శ్రోతలను అలరించింది. ఈ మెలోడీ సాంగ్ తో కందికొండకి మంచి గుర్తింపు లభించింది. దీంతో సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. 'ఇడియట్' సినిమాలో 'చూపులతో గుచ్చి గుచ్చి చంపకే', 'సత్యం' సినిమాలో 'మధురమే మధురమే', 'ఐయామ్ ఇన్ లవ్' ఇలా ఎన్నో హిట్టు పాటలను రచించారు. చివరిగా 'నీది నాది ఒకే కథ' సినిమాలో రెండు పాటలను రాశారు. అయితే చాలా కాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కందికొండ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంది. మంత్రి కేటీఆర్(KTR) ఆదేశాల మేరకు కందికొండకి ట్రీట్మెంట్ అందించారు. కొన్ని రోజుల పాటు ఆరోగ్యం నిలకడగానే ఉన్నా మళ్లీ క్షీణించడంతో ఆయన మరణించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.