"ఒకళ్లని లేదా కొంతమంది దేవతలను చిన్నచూపుగా మాట్లాడతామనడం సరికాదు. ఒక విషయం విన్నప్పుడు పూర్వాపరాలు చూడాలన్నారు. అలా చూడకుండా మాట్లాడితే వాళ్లను చూసి జాలి పడాల్సి వస్తోంది. నేను కూడా ఏదో అన్నాను అంటూ కామెంట్ చేస్తున్నట్టు వినిపించింది. అలాంటిది ఎప్పుడూ చేయబోం. ఈ మధ్యకాలంలో అన్న కామెంట్ కాదు. ఇరవై ఏళ్లకు క్రితం అన్నట్టు తెలుస్తోంది. గ్రామదేవతలను తూలనాడినట్టు అది ఆదివాసులు చాలా బాధపడ్డారని తెలుస్తోంది. భారత్ దేశంలో ఏ సంస్థ చేయని కార్యక్రమంలో వికాస తరంగిణి చేస్తోంది. అందులో ఉన్న ఆరోగ్య విభాగం చాలా గ్రామాల్లో మహిళల ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తోంది. మహిళలకు వచ్చే క్యాన్సర్‌లపై అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. ఉచితంగా పరీక్షలు చేస్తోంది. పన్నెండున్నర లక్షల మందికి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో క్రిస్టియన్స్, ముస్లిం సహా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. అలాంటి సేవ చేస్తున్నవాళ్లం గ్రామ దేవతలను తూలనాడుతామా" అని చినజీయర్ అన్నారు.
త్రిదండి చినజీయర్ స్వామి విజయవాడలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ "ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం. మహిళ సమాజానికి మూల కేంద్రం. ఒక శక్తికి స్థానం మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, దేశం, సమాజం, ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. మొదటి పుష్పాన్ని పెట్టాల్సింది తల్లిపాదాల వద్ద. శరీరానికి రూపాన్నిచ్చింది తల్లి. దానికి ఆధారం తండ్రి. శరీరంలో జ్ఞానం పోసేది గురువు. తల్లిదే పూజ్య స్థానం. రామానుజాచార్యలు కూడా పూజ్య స్థానాన్ని ఇవ్వాలని గోదాదేవికి సోదరి స్థానాన్ని ఇచ్చారు." అని అన్నారు
"ఆదివాసులు, గిరిజనులు, దళితులు ఎవరైనా జ్ఞానవంతులైతే పూజ్యులని చిన జీయర్ చెప్పారు. రామాజక పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక విప్లవం. చదువుకున్న ప్రాంతాల్లోనే కాకుండా చదువుకు దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో అక్కడ ఆదివాసీ జనం కోసం స్కూల్స్ ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్‌లాంటి ప్రాంతంలోని అల్లంపల్లిలో 2002లో స్టార్ట్ 2004 జనవరి 26న పూర్తి చేశాం. వాళ్లంతటా వాళ్లే విద్యావంతులు అయ్యే అవకాశం కల్పించాం. వాళ్ల కోరికతోనే పక్కనే ఉన్న బీర్‌సాయిబ్‌పేటలో మరో స్కూల్ ప్రారంభించాం." అని చిన జీయర్ అన్నారు.
ఆదివాసులు అవకాశం లేకనే వెనుకబడ్డారని చిన జీయర్ అన్నారు. అవకాశం కల్పిస్తే ఏం చేస్తారో నిరూపించారన్నారు. మంత్రాలు కూడా అద్భుతంగా చెబుతున్నారన్నారు. ఆదివాసులకు, హరిజనులకు తేడా లేకుండా అడుగు, బడుగు వర్గాలందరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భావిస్తున్నామని చిన జీయర్ అన్నారు. లక్ష్మీ అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా లక్ష్మీ అమ్మవారు ఎనిమిది రూపాల్లో ఉండే విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏప్రిల్ 16 నుంచి ఐదు రోజుల పాటు ప్రతిష్ఠాపన పూజలు జరగనున్నాయని తెలిపారు. దీనికి అందరూ రావాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఇటీవల తనపై వచ్చిన వివాదాలపై స్పందించారు చినజీయర్. అసలు అలాంటి అంశాలపై స్పందించేవాళ్లు పూర్వాపరాలు పరిశీలించాలని సూచించారు. అలా కాకుండా విమర్శలు చేసేవాళ్ల కామెంట్స్‌ను వాళ్ల వివేచనానికే వదిలేస్తున్నానన్నారు. ఆదివాసి జనానికి ముఖ్యమంగా మహిళలకు అగ్రాసనం ఉండాలని ఆలోచించే సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లమని ఆయన అన్నారు. వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు తనకు లేదన్నారు. మేం అందరినీ ఆరాధించాలని కోరుతున్నామని చిన జీయర్ తెలిపారు. స్వీయ ఆరాధాన, సర్వ ఆదరణ అనే స్లోగన్ తమ సంస్కృతిలో ఉందన్నారు.
"దేవతలను ఎప్పుడూ కించపరచబోం.. కానీ అలాంటి పేరుతో చేసే ప్రచారం చాలా ప్రమాదకరం. పనికట్టుకొని దీన్ని పెద్ద ఇష్యూ చేసి టీవీల్లో ముఖాలు ప్రదర్శిస్తున్నారు. ఉక్రెయిన్ హడావుడి తగ్గినందున దీన్ని ఇష్యూ చేస్తున్నారు. ఏదో ఒక ఇష్యూ ఉండాలనే ఇలా చేస్తున్నట్టు ఉన్నారు. నిజంగా సమాజం మంచిని కోరే వాళ్లు వచ్చి అడగాలి. అంతే కానీ టీవీల్లో ముఖాలు చూపిస్తే అల్ప ప్రచారం అవుతుందన్నారు. సమజానికి హితం చేసే వాళ్లు ఎవరితోనైనా మేం కలిసి పని చేస్తాం. మాతో కలిసి పని చేసే వారిలో చాలా మంది ఆస్తికులు, నాస్తికులు ఉన్నారు. కేవలం పబ్లిసిటీ కోసం టీవీల ద్వారా అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టడం చాలా సులభం. కానీ అది సమాజానికి హితం కాదు. సమాజానికి హితం కోసం చేసే ప్రయత్నాల్లో మేం ఎప్పుడూ బద్ద దీక్షితులపై ఉంటామన్నారు. రకరకాలుగా మాట్లాడే వాళ్లు.. ఏదో ఒక కెమెరా దొరికిందని మాట్లాడితే సాధించేది ఏమీ ఉండదు. ఇలాంటి వాటి వల్ల ప్రజలను రెచ్చగొట్టడమే తప్ప సమాజానికి ప్రయోజనం లేదు. ఇలాంటి వాటి వల్ల తాత్కాలిక ప్రయోజాలు ఉండవచ్చేమో కానీ దీర్ఘకాలిక నష్టం ఉంటుందన్నారు. ఎప్పుడో జరిగిన ఇష్యూపై ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లకు కళ్లు లేవు" అని చిన జీయర్ అన్నారు.