Tirumala Arjitha Sevas: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలు పునః ప్రారంభిస్తామని టీటీడీ(TTD) అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి(AV Dharma Reddy) స్పష్టం చేశారు. తిరుప‌తిలోని మార్కెటింగ్ గోడౌన్లో జీడిపప్పు గుండ్లను బద్దలుగా మార్చే కేంద్రాన్ని టీటీడీ అద‌న‌పు ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రారంభించారు. ఆయ‌న మాట్లాడుతూ శ్రీ‌వారి ల‌డ్డూ, ఇత‌ర ప్రసాదాల త‌యారీ కోసం రోజుకు 4500 నుంచి 5 వేల‌ కిలోల జీడిప‌ప్పు బ‌ద్దలు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని చెప్పారు. గ‌తంలో వీటిని టెండ‌ర్ ద్వారా కొనుగోలు చేసేవార‌మ‌న్నారు. కొంత కాలంగా టీటీడీ నాణ్యతా ప్రమాణాలకు త‌గిన జీడిప‌ప్పు(Cashew) బ‌ద్దలు ల‌భించ‌డం లేద‌ని చెప్పారు. దీని వ‌ల్ల ప్రసాదాల త‌యారీకి ఇబ్బంది ప‌డే ప‌రిస్థితులు రాకూడ‌ద‌ని కేర‌ళకు టీటీడీ మార్కెటింగ్ అధికారుల బృందాన్ని పంపి జీడిప‌ప్పు గుండ్లను బ‌ద్దలుగా మార్చే ప్రక్రియ‌ను అధ్యయనం చేశామని వివరించారు. 



(టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి)


ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆర్జిత సేవలు


ఇందుకోసం మార్కెటింగ్ గోడౌన్‌లో ప్రత్యేక హాలు, శ్రీ‌వారి సేవ‌కులు, టీటీడీ ఉద్యోగుల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించామ‌ని అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించనున్నామన్నారు. క‌రోనా మహమ్మారికి ముందు ఆర్జిత సేవా టికెట్ల జారీ విధానం ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంద‌న్నారు. ఆన్‌లైన్, ల‌క్కీడిప్‌, సిఫార‌సు లేఖ‌ల‌పై టికెట్లు పొంద‌వ‌చ్చన్నారు. ఇప్పటి వ‌ర‌కు 130 ఉద‌యాస్తమాన సేవా టికెట్లు ఆన్‌లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు.  


స్లాట్ లేకుండా తిరుమలకు నో ఎంట్రీ


"కరోనా ముందు దర్శనాలు ఎలా ఉండేవో అలా తిరిగి ప్రారంభిస్తాం. టీటీడీ బోర్డు చెప్పినట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభిస్తాం. దర్శనం లేదా సేవ టోకెన్ ఉంటే గాని తిరుమలకు అనుమతి ఉండదు. స్లాట్ సిస్టమ్ అమలు చేస్తాం. ఇంతకు ముందు స్లాట్ లేకుండా వైకుంఠ క్యూలో వచ్చి వేచి ఉండేవారు. ఇప్పుడు ఆ పద్దతి లేదు. కచ్చితంగా స్లాట్ బుక్ చేసుకున్న వారినే కొండ పైకి అనుమతిస్తాం. అడ్వాన్స్ బుక్కింగ్, డిప్ సిస్టమ్, కరోనా ముందు ఎలా ఉండేదో అదే విధంగా అన్ని సేవలు ప్రారంభిస్తాం. ఉదయాస్తమానం సేవా టికెట్లు సుమారు 500 వరకు ఉన్నాయి. అందులో 130-140 వరకు బుక్ అయ్యాయి."