Bhimla Nayak in Aha | పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’(Bhimla Nayak) చిత్రం ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం ఒకేసారి రెండు ఓటీటీలో విడుదల అవుతోంది. దీంతో ఓటీటీల మధ్య పోటీ కూడా ఆ స్థాయిలోనే ఉంది. ఎక్కువమంది తమ ఓటీటీలోనే చూడాలనే లక్ష్యంతో ‘డిస్నీ హాట్ స్టార్’, ‘ఆహా’ ఓటీటీలు ‘భీమ్లా నాయక్’ ప్రమోషన్లో తలమునకలవుతున్నాయి. అయితే, ‘ఆహా’ ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌ను స్వయంగా ఎడిట్ చేసి వదిలింది. ఇది ఒరిజినల్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ కంటే భిన్నంగా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే, ‘భీమ్లా నాయక్’ ఒరిజినల్ ట్రైలర్ అప్పట్లో అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అది కాస్త పర్వాలేదని అనిపించుకుంది. అయితే, ‘ఆహా’ ఎడిట్ చేసిన ఈ ట్రైలర్ మాత్రం అంతకు మించి ఉందని అభిమానులు అంటున్నారు. 


పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లో విడుదలై మాంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే. ఇది ఓటీటీలో విడుదల అవుతుందని తెలియగానే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. డేట్ కోసం వేయి కళ్లతో వేచిచూశారు. ఎట్టకేలకు ‘డిస్నీ హాట్ స్టార్’, ‘ఆహా’లు ఒకే రోజు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. రెండు ఓటీటీల్లో మార్చి 25న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అంటే, మార్చి 24 అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల నుంచి ‘భీమ్లా నాయక్’ స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు థియేటర్లో ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా విడుదల కానుంది. టికెట్లు దొరికినవారికి ‘ఆర్ఆర్ఆర్’, దొరకనివారికి ‘భీమ్లా నాయక్’ ఫిదా చేయనున్నాయి. వచ్చే శుక్రవారం పక్కాగా టాలీవుడ్‌లో సినీ సందడి మామూలుగా ఉండదు. ‘భీమ్లా నాయక్’లో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటించారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. తమన్ సంగీతం అందించారు. మరి ‘ఆహా’ రూపొందించిన Bhimla Nayak ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి.