Kishan Reddy On Secunderabad Protest : అగ్నిపథ్‌ రీక్రూట్మెంట్ విషయంలో యువతను తప్పుదారి పట్టించడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ ఆందోళనలు పథకం ప్రకారమే జరిగాయన్నారు. యువతలో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నంలో భాగంగానే అగ్నిపథ్‌ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ విధానం పలు దేశాల్లో ఏళ్లుగా అమల్లో ఉన్నాయన్నారు. దేశంలో ఈ పథకం తప్పనిసరి చేయట్లే్దన్నారు. అగ్నిపథ్‌ ప్రకటన కేంద్రం ఏకపక్ష నిర్ణయం కాదన్నారు. మోదీ ప్రధాని కాకముందు నుంచే అగ్నిపథ్ పై చర్చలు జరుగుతున్నాయన్నారు. 


సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆందోళనలు


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అగ్నిపథ్‌ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సుమారు ఐదు వేల ఆందోళకారులు శుక్రవారం ఉదయం ఒక్కసారిగా  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చొచ్చుకొచ్చారు. ప్లాట్‌ఫామ్‌లపైకి చేరి విధ్వంసం సృష్టించారు. పోలీసులు నిరసనకారులను అదుపుచేయలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ప్రాణభయంతో స్టేషన్ నుంచి పరుగులు తీశారు.






ఇతర దేశాల్లోనూ అమలు 


అ‍గ్నిపథ్‌ వంటి పథకాలు ఇతర దేశాల్లో అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అగ్నిపథ్‌ విషయంలో యువతను తప్పుదారి పట్టించడం సరికాదన్నారు. అగ్నిపథ్ బలవంతపు ట్రైనింగ్‌ కాదని, స్వచ్ఛందంగానే సైన్యంలో చేరవచ్చన్నారు. అగ్నిపథ్‌ యువతకు వ్యతిరేకం కాదని కిషన్ రెడ్డి తెలిపారు. కుట్రపూరితంగానే అగ్నిపథ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అగ్నిపథ్ లో చేరడం యువకులకు అదనపు అర్హత అన్నారు. స్వచ్ఛందంగానే ఈ పథకంలో చేరవచ్చన్నారు. ఇందులో ఎవరినీ బలవంతం చేసేది లేదన్నారు. దేశ సేవ చేయాలనుకునే వాళ్లు అగ్నిపథ్‌ లో పాల్గోవచ్చాన్నారు.  ఇజ్రాయిల్‌లో 12 నెలలు, ఇరాన్‌లో 20 నెలలపాటు సైన్యంలో పనిచేసే అవకాశం ఉందన్నారు. యూఏఈలోనూ ఇటువంటి పథకం ఆరేళ్ల నుంచి అమలు చేస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్‌లో ఈ పథకాన్ని తప్పనిసరి కాదన్నారు. అగ్నిపథ్‌ నుంచి బయటకు వచ్చాక యువత 10 మందికి ఉపాధి కల్పించేలా తయారవుతారన్నారు. 


దాడి దురదృష్టకరం 


కేంద్ర ప్రభుత్వం వాలంటరీ పథకం తీసుకొస్తుంటే దాడులు చేయడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రయాణికులు లగేజ్ వదిలిపెట్టి భయంతో పరిగెత్తే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. పథకం ప్రకారమే రైల్వే స్టేషన్‌ లో విధ్వంసం చేశారని ఆరోపించారు. సికింద్రాబాద్‌ ఘటనలో రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారన్నారు. రైల్వే కోచ్ లకు నిప్పు పెట్టడం, బైక్ లు తగబెట్టడం సమంజసం కాదన్నారు. ఇంత జరుగుతుంటే పోలీసులు ఎందుకు స్పందించలేదన్నారు.