ABV In Office :    మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫాంలో డ్యూటీకి హాజరయ్యారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అది లూప్ లైన్ పోస్ట్ అని తాను అనుకోవడం లేదని. నిరుత్సాహానికి గురి కావడమనే సమస్య ఎప్పటికి తలెత్తదని ఆయన స్పష్టం చేశారు. విజ‌య‌వాడ ముత్యాలంపాడు  ప్రభుత్వ ముద్రణాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆయనను అభినందించారు.  


నిరుత్సాహ పడే ప్రశ్నే లేదు !


మూడు సంవత్సరాల తర్వాత  ప్రింటింగ్ స్టేషనరీ  స్టోర్స్ పర్చేజ్ శాఖ కమిషనర్ గా ప్రభుత్వం తనను నియమించిందన్నారు. సస్పెన్షన్ పై తాను కోర్టును ఆశ్రయించానని, కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం  తనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చిందని గుర్తు చేశారు.  ఇప్ప టివరకు ఈ శాఖపై తనకు అంతగా తెలియదని, ఉద్యోగులతో మాట్లాడి అవగాహన పెంచుకుని ప్రభుత్వానికి ప్రజలకు, ఉపయోగకరంగా పని చేస్తానని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ శాఖకు ప్రాధాన్యత క్రమంగా తగ్గిందని, విభజన తర్వాత పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదని అన్నారు.   శాఖ పై అధ్యయనం చేస్తామన్నారు.  ప్రభుత్వం ప్రాధాన్యత లేని శాఖ పోస్టు ఇచ్చింది అనడం సరికాదన్నారు. తాను నిరుత్సాహానికి గురి కావడం ఎప్పటికీ జరగదని ఆయన స్పష్టం చేశారు. 


శాఖపై పట్టు  కోసం ప్రయత్నిస్తా 


బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏబీ  వెంకటేశ్వరరావు సిబ్బందితో కలసి ప్రభుత్వ ముద్రణాలయంలో పలు విభాగాలను పరిశీలించారు. శాఖకు సంబంధించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవ‌ల కాలంలో కోర్టు తీర్పు ను అమ‌లు చేయాల‌ని కోరుతూ ఎబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఎపీ సీఎస్ ను క‌ల‌సేందుకు ప్ర‌య‌త్నించారు.అయితే సీఎస్ ఎబీకి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేదు. రిపోర్టింగ్ చేసిన‌ట్లుగా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌సేందుకు ఎబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి అదికారులు సహ‌క‌రించ‌లేద‌ని ఆయ‌న అనేక సార్లు మీడియాకు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వం చివ‌ర‌కు పోస్టింగ్ ఇచ్చింది. 


సుదీర్ఘంగా పోరాడి పోస్టింగ్ తెచ్చుకున్న ఏబీవీ


ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వం పైన‌ ఎబీ వెంక‌టేశ్వ‌ర‌రావు తీవ్ర స్దాయిలో విమ‌ర్శ‌లు చేశారు. అసెంబ్లీ లోపల...బయట కూడా  కూడ ఎబీ పై అదికార పార్టీకి చెందిన శాస‌న స‌భ్యులు ఆరోప‌ణ‌లు చేశారు. పెగ‌సెస్ వ్య‌వ‌హ‌రంలో కూడ ఎబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పాత్ర ఉంద‌ని ఆరోప‌ించారు ఆ ఆరోపణలపై పరువు నష్టం దావా వేసేందుకు ఏబీవీ సీఎస్ అనుమతి కోరారు. ఇప్పటి వరకూ అనుమతి రాలేదు.