ఉద్యోగాల ప్రకటన...ఎన్నికల స్టంటేనా

అసలే అవకాశాలు తక్కువ, ఆ పై కరోనా. ఫలితంగా దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతూ వచ్చింది. ఉన్న ఉపాధినీ కోల్పోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది నిరుద్యోగ యువత. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే కబురు వినిపించింది. ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖల్లోని మానవ వనరుల స్థితిగతులను పరిశీలించిన తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని. అయితే ఈ ప్రకటనలు, నిర్ణయాలన్నీ 2024 సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే అనే వాదన వినిపిస్తోంది. ఉద్యోగాల విషయంలో ఇన్ని రోజులు మౌనంగా ఉన్న కేంద్రం ఉన్నట్టుండి ఎందుకీ ప్రకటన చేసిందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే భాజపా 
ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. 


అన్ని పార్టీల ఎజెండా ఉపాధి కల్పనే...

ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశంలో 2023 డిసెంబర్ నాటికి 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకి 1,825 మందికి ఉద్యోగాలివ్వాలి. మరో 18 నెలల సమయంలో నెలకు 54,745 ఉద్యోగాలు భర్తీ చేస్తేనే..కేంద్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలదు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న భారత్‌లో ఉపాధి కల్పన అనేదే అన్ని పార్టీల ఎజెండాగా మారిపోయింది. దేశ జనాభాలో 66% మంది 35 ఏళ్ల లోపు వారే. 18-29 ఏళ్ల మధ్య ఉన్న జనాభా 22% మందిగా ఉన్నారు. వీళ్లందరినీ ప్రసన్నం చేసుకుంటే సులువుగా విజయం సాధించవచన్నది పార్టీల వ్యూహం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది కూడా యువతను ఆకట్టుకునేందుకేనన్నది కొందరి విశ్లేషణ. 

 

సంవత్సరం

యూపీఎస్‌సీ

ఎస్‌ఎస్‌సీ

ఆర్‌ఆర్‌బీ

మొత్తం

2016-17

5,735

68,880

27,538

1,02,153

2017-18

6,294

45,391

25,507

77,192

2018-19

4,399

16,748

17,680

38,827

2019-20

5,230

14,691

1,28,456

1,48,377

2020-21

3,609

68,891

5,764

78,264

మొత్తం

25,267

2,14,601

2,04,945

4,44,813

Source: వ్యక్తిగత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 


ఉద్యోగాల భర్తీతోనే జీడీపీ పెరుగుదల 

ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 4.45లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. ఈ ఏడాది మే నాటికి 13 రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైంది. 2020 నాటికే కేంద్ర ప్రభుత్వ  విభాగాల్లో దాదాపు 9 లక్షల పోస్ట్‌లు ఖాళీగా ఉన్నట్టు అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఏటా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు అందించగలిగితే దేశ జీడీపీ గణనీయంగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 3 లక్షల కోట్లు కాగా, 2023 నాటికి ఈ విలువ 9లక్షల కోట్లకు, 2047 నాటికి 40 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. అందుకు అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేయగలిగితే అనూహ్య స్థాయిలో జీడీపీ పెరుగుతుంది.