Kishan Reddy : బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలు, సామాగ్రి ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఎంపీ అర్వింద్ ఇంట్లో లేరు. ఆయన తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ తల్లిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. దాడి జరిగిన తీరును కిషన్ రెడ్డి పరిశీలించారు. అర్వింద్ తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చే ఉద్దేశం తమకు లేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. ఒకరిని భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదని కిషన్‌రెడ్డి అన్నారు. రాజీనామాలు కూడా చేయించకుండా కేసీఆర్ ఇతర పార్టీల నేతలను చేర్చుకున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై సీఎం కేసీఆర్ పైనా కేసు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరాశతోనే దాడులకు దిగుతున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరాశతోనే దాడులు
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవాలని ఉద్దేశం తమకు లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సానుభూతి కోసం టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ నిరాశతోనే తమపై దాడులకు దిగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన కూడా లేదని కిషన్ రెడ్డి అన్నారు. కవితను బీజేపీలోకి చేరాలని ఒత్తిడి చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీకి తెలంగాణ సమాజం అండగా ఉంటుందన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, నరేంద్రమోదీ నాయకత్వంపై విశ్వాసం ఉన్న వారినే పార్టీలో చేర్చకుంటామన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్, వారితో రాజీనామా కూడా చేయించలేదన్నారు. భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీకి లేదని కిషన్ రెడ్డి చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై కేసు పెట్టాలంటే సీఎం కేసీఆర్ మీదే ఫస్ట్ పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
దాడులు దుర్మార్గమైన చర్య
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కూతురు కవితను బీజేపీలోకి ఆహ్వానించారన్న వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలతో కవిత టచ్ లో ఉన్నారనే వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని, తన ఆరోపణలపై కవిత ఇంతగా రియాక్ట్ అయిందంటే అది నిజమే అయి ఉండొచ్చునని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. ఈ ఘటనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గుల గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి స్పందించారు. బీజేపీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక, నిరాశ లోనై బీజేపీ ప్రజాప్రతినిధుల ఇండ్లపై కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. ఏవరైనా నేతలు కామెంట్లు చేస్తే అందుకు ఆ నేత క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
కేటీఆర్, కవిత వచ్చినా సాధరంగా ఆహ్వానిస్తాం
ప్రధాని అవాజ్ యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక పోతున్న కేసీఆర్ ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. తాను చేసిన తప్పులు తప్పించుకొనికే ముఖం చూపించే ధైర్యం లేకే కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీజేపీలోకి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇలా ఎవ్వరు వచ్చినా సాధరంగా ఆహ్వానం పలుకుతామని కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ దే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలకు అదుపేలేకుండా పోతుంతన్నారు. ఒడిషా గనుల పై మంచి లాభాన్ని గడిస్తుంటే , తెలంగాణలో గనుల వచ్చే రాబడిని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా పోతుందన్నారు.