CBI Questions Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. దిల్లీ ఓబరాయ్ హోటల్ లో రూపొందిన లిక్కర్ పాలసీలో కవిత పాత్ర ఉందని, సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల డబ్బు తరలింపులో ఆమె భాగస్వామిగా ఉందని సీబీఐ ఆరోపిస్తుంది. అలాగే కవిత 10 మొబైల్స్ మార్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరుగురిని అరెస్ట్ చేశాయి దర్యాప్తు సంస్థలు. ఎమ్మెల్సీ కవితపై సీబీఐ అధికారుల ప్రశ్నల వర్షం కురించారు. సీబీఐ అధికారుల అడిగిన ప్రశ్నలు మీడియాకు లీకయ్యాయి. 


కవితపై ప్రశ్నల వర్షం?



  • దిల్లీ లిక్కర్ స్కాంతో మీకు ఉన్న సంబంధం ఏమిటి?

  • దిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఉందా?

  • అమిత్ అరోరా మీకు తెలుసా?

  • అమిత్ అరోరాతో ఉన్న సంబంధం ఏమిటి?

  • అమిత్ అరోరా కాల్ లిస్ట్ లో మీ నంబర్ ఎందుకు ఉంది?

  • 10 మొబైల్స్ మార్చారా?

  • సౌత్ గ్రూప్ లో మీ పాత్ర ఉందా?

  • అమిత్ అరోరా మీ పేరు ఎందుకు చెప్పారు?

  • విజయ్ నాయర్ తెలుసా?

  • విజయ్ నాయర్ కి రూ.100 కోట్ల తరలింపులో మీ పాత్ర ఉందా

  • లిక్కర్ పాలసీ, లిక్కర్ తయారీ కంపెనీలకు అనుకూలంగా రూపొందించడంలో మీ పాత్ర ఉందా?

  • దిల్లీలో ఎక్సైజ్ శాఖ అధికారులను కలిశారా?

  • లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీరు భాగస్వామిగా ఉన్నారా?

  • అమిత్ అరోరా, విజయ్ నాయర్ తో ఉన్న సంబంధం ఏమిటి?

  •  సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా మీరు ఉన్నారా?


అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలపై ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆరా తీయనున్నారు. ఇప్పటికే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా కవిత ఉన్నారని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు ఇచ్చేందుకు రూ.100 కోట్లను విజయ్ నాయర్ కు అందినట్లు సీబీఐ, ఈడీ ఆరోపణలు చేస్తున్నాయి.


డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ ఫ్లెక్సీలు


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ బృందం ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకుంది. ఆమె నివాసంలోనే విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారణ చేయాల్సి ఉంది. కానీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. కవిత ఇంటికి సీబీఐ అధికారులు రెండు టీమ్‌లుగా వచ్చారు. సీబీఐ టీమ్‌లలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి కవితను ఓ సాక్షిగా మాత్రమే విచారణ చేయనున్నారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్‌లో న్యాయ నిపుణులతో పాటు సీఎం కేసీఆర్ తో నోటీసులపై కవిత మాట్లాడారు. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కవిత ఇంటి ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యోధుని కుమార్తె ఎప్పటికీ భయపడబోదనే అర్థం వచ్చేలా ‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’ అని ఫ్లెక్సీలు పెట్టారు.