BJP Vs BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంతో ఒక్కసారిగా హైలెట్‌ అయిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. డ్రగ్స్‌ కేసులో విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు అందుకున్నారు. నిన్నటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు  దొరక్కుండా ఉన్న పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఇప్పుడు ఈడీ చేతుల్లో చిక్కడంతో మరోసారి తెలంగాణలో రాజకీయం హాటెక్కింది.


పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు 


కొన్నినెలలుగా తెలంగాణలో  బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ వార్‌ నడుస్తోంది. ఈడీ, ఐటీ దాడులతో కేంద్రం అధికార పార్టీపై దాడులు చేస్తుంటే దానికి ప్రతిగా ఏసీబీ, విజిలెన్స్‌ దాడులతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అలా ఇప్పుడు ఈడీ దర్యాప్తులో ఇరుక్కున్నారు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌ రెడ్డి కూడా ఉన్నారు. మీడియాకి దూరంగా, కేసీఆర్‌ నీడలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో రోహిత్‌ రెడ్డి ఒకరు. ప్రస్తుతం రోహిత్‌ రెడ్డిని ఎలాగైనా సరే విచారించాలని బీజేపీ ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడు తప్పించుకున్న తాండూరు ఎమ్మెల్యేపై ఇప్పుడు ఈడీ చేతిలో చిక్కుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.


ముందే చెప్పిన బండి సంజయ్


ఓ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి  ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిపై కేసు నమోదైంది. బెంగళూరు డ్రగ్స్‌ కేసుని మళ్లీ  బయటకు తీస్తామని ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఆయన అలా చెప్పారో లేదో ఇలా పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి ఈడీ నోటీసులు వచ్చాయి. ఇదే కాదు బీఆర్‌ఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలపై ఉన్న పాత కేసులన్నింటిని బయటకు తీసే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు డ్రగ్స్‌ కేసు త్వరలోనే మిగిలిన కేసులను కూడా బయటకు తీసి గులాబీ పార్టీలో గుబులు రేపాలని కాషాయం పార్టీ పట్టుదలతో ఉందట. మునుగోడు ఉపఎన్నికలకు ముందే రాష్ట్ర బీజేపీ నేతలు అధికార పార్టీ నేతలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయని చెప్పారు. అలా ప్రకటించిన కొద్ది టైమ్‌ లోనే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై వరసగా దాడులు జరిగిన విషయం తెలిసిందే.


త్వరలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు 


కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుగా పెట్టుకొని బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఆ విమర్శలు నిజమేనన్నట్లు మునుగోడు ఉపఎన్నిక తర్వాత వరసగా ఈడీ, ఐటీ దాడులతో గులాబీదళాన్ని హడలెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి డ్రగ్స్‌ కేసులో పైలెట్‌ రోహిత్‌ రెడ్డి కేంద్రం చేతికి చిక్కారు. త్వరలోనే మిగిలిన ముగ్గురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కూడా పలు కేసుల్లో ఈడీ, ఐటీ విచారణకు పిలిచే అవకాశాలు లేకపోలేదన్న టాక్‌ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు అంద‌జేసింది. అయితే ఈ కేసు విచారణకు హాజరుకాకుండా స్టే విధించాలని కోరడంతో న్యాయస్థానం ఈనెల 22 వరకు విచారణపై స్టే విధించింది. బీజేపీలోని కీలక నేతను కేసీఆర్‌ సర్కార్‌ ఇరికించాలని ప్రయత్నించిందని ఇప్పటికే కాషాయం నేతలు ఆరోపించారు. దానికి ప్రతిగానే ఇప్పుడు రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌ కేసులో ఈడీ నోటీసులిచ్చిందన్న టాక్‌ నడుస్తోంది.