Elon Musk Tesla Shares: సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కొంటానని 2022 ఏప్రిల్‌లో ప్రకటించిన దగ్గర్నుంచి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అదృష్టం తలకిందులైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ పూర్తిగా మస్క్‌ చేతికి వచ్చింది. అప్పటి నుంచి టైమ్‌ మరీ బ్యాడ్‌ అయింది. 


ట్విట్టర్‌ కొనుగోలు కోసం ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు టెస్లా ‍‌(Tesla- ప్రపంచంలో ఖరీదైన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ) షేర్లను అమ్ముకున్న ఎలాన్ మస్క్, తాజాగా మరోమారు టెస్లా షేర్లను విక్రయించారు. ఈసారి సుమారు 3.58 బిలియన్ డాలర్ల విలువైన షేర్లకు మంగళం పాడారు. యుఎస్ సెక్యూరిటీస్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం... 22 మిలియన్ షేర్లను విక్రయించారు. 2022 డిసెంబర్ 12 -15 తేదీల మధ్య ఈ ట్రాన్జాక్షన్‌ జరిగింది. 


ఇప్పటివరకు ఎన్ని టెస్లా షేర్లు అమ్మారు?
టెస్లాలో వాటాను ఎలాన్‌ మస్క్‌ అమ్ముకోవడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. నవంబర్‌ నెలలోనూ దాదాపు 4 బిలియన్ డాలర్ల (రూ. 32.6 వేల కోట్లు) విలువైన టెస్లా షేర్లను అమ్మారు. అప్పుడు దాదాపు 1.95 కోట్ల షేర్లను విక్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 8.4 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను, ఇదే ఏడాది ఆగస్టులో మరో 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. కంపెనీలో ఇకపై షేర్లను విక్రయించే ఆలోచన లేదని ఆగస్టు విక్రయం సమయంలో టెస్లా CEO (ఎలాన్‌ మస్క్‌) ట్వీట్ చేశారు. మాట మీద నిలబడితే మస్క్‌ కాదు అన్నట్లుగా, ఆగస్టు తర్వాత మళ్లీ రెండు విడతల్లో (నవంబర్‌లో, డిసెంబర్‌లో) టెస్లా షేర్లను ఆఫ్‌లోడ్‌ చేశారు. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఈ సంవత్సరం ఎలాన్ మస్క్ 40 బిలియన్ డాలర్లకు పైగా విలువైన టెస్లా షేర్లను విక్రయించారు. 


విశేషం ఏంటంటే, ఇంత పెద్ద సంఖ్యలో టెస్లా షేర్లను ఎందుకు విక్రయించారన్న దాని గురించి ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. డేటా ప్రకారం.. మస్క్ పెద్ద సంఖ్యలో టెస్లా షేర్లను విక్రయించిన తర్వాత కూడా, ఆ కంపెనీలో 13.4 శాతం కలిగి ఉన్నారు. ఇప్పటికీ టెస్లాలో అతి పెద్ద వాటాదారుగా ఉన్నారు.


ట్విట్టర్ టేకోవర్ డీల్ దగ్గర్నుంచి టెస్లా షేర్లు స్థిరంగా పడిపోతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన స్టాక్‌గా టెస్లా నిలిచింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ టెస్లాకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ట్విట్టర్‌ మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. దీంతో, టెస్లా పెట్టుబడిదారులలో ఈ కంపెనీ గురించి ఆందోళన నెలకొంది. ఫలితంగా షేర్లు అమ్మేసుకుని వెళ్లిపోతున్నారు. అందువల్లే, ఈ ఏడాదిలో టెస్లా షేరు దాదాపు 50 శాతం పతనమైంది. సెప్టెంబర్‌ నెల నుంచి 40 శాతం పడిపోయింది.


ఎలాన్ మస్క్ ఇప్పుడు నంబర్‌ 1 కాదు
టెస్లా షేర్ల విక్రయం రూపంలో సంపద హరించుకుపోవడంతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కిరీటాన్ని ఎలాన్‌ మస్క్‌ కోల్పోయారు. బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో 1వ స్థానం నుంచి 2వ స్థానానికి దిగి వచ్చారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అత్యంత ధనవంతుడిగా తొలి స్థానంలో ఉన్నారు. భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ 132.6 బిలియన్ డాలర్ల ఆస్తులతో 3వ స్థానంలో ఉన్నారు.