MP Laxman On TRS : టీఆర్ఎస్ లో చాలా మంది కట్టప్పలు ఉన్నారని బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రాంతం వ్యక్తికి యూపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ లకు ధన్యవాదాలు తెలిపారు.  బీజేపీ మిషన్ దక్షిన్ పేరుతో ప్రత్యేక దృష్టి పెట్టారని, పెద్దోళ్ల కన్నా పేదోళ్లకే బీజేపీకి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనమే అన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థి గెలుపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దోచుకున్నది చాలదని జాతీయ రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పగటి కల అన్నారు. 


ముందస్తుకు వెళ్లే యోచనలో కేసీఆర్


మాజీ ప్రధాని పీవీ పేరు చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయం చేశారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఇప్పుడు పీవీని పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. అసెంబ్లీ రద్దు మాత్రమే రాష్ట్రం చేతులో ఉంటుందని, ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ చేతిలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు బీజేపీ మద్దతు ఉంటుందన్నారు. 


బీజేపీ ప్రత్యామ్నాయం


అనేక పదవుల్లో వెనకబడిన వర్గాలకు బీజేపీ గుర్తింపు ఇస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రపతి కోటాలో దక్షిణాదికి పెద్దపీట వేస్తూ నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిందన్నారు. బీజేపీ పేదలకు ప్రాధాన్యం కల్పిస్తున్న పార్టీ అన్నారు. జాతీయ పార్టీ అని సీఎం కేసీఆర్ పగటి కలలుకంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతున్నారు. టీఆర్ఎస్‌లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యసభ ఎంపీగా డా.కె లక్ష్మణ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. లక్ష్మణ్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.