MP Dharmapuri Arvind : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ మలుపులు తిరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా డ్రామా అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆ నలుగురు సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలని విమర్శించారు. వాళ్లకు అంత రేటు ఉంటుందా? అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ నలుగురిలో ఒక్కరూ గెలిచేవాళ్లు లేరన్నారు. టీఆర్ఎస్ డ్రామా చూసి ప్రజలు కాసేపు నవ్వుకున్నారన్నారు. ఈ వ్యవహారం అంతా ప్రగతి భవన్ డైరెక్షన్ లో నడిచిందన్నారు. నలుగురు తాగుబోతులతో ప్రగతి భవన్ నుంచి కథ నడిపించారని ఆరోపించారు. మునుగోడులో ఓటమి భయంతో టీఎస్ఆర్ నాటకాలకు తెరలేపిందన్నారు. దేశంలో ఎక్కడా సిట్టింగ్ పార్టీ ఎమ్మెల్యేను బీజేపీలోకి తీసుకోలేదన్నారు. బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి, గెలుస్తారనే నమ్మకం ఉంటేనే పార్టీలోకి తీసుకుంటామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. 






హైకోర్టులో బీజేపీ పిటిషన్ 


మొయినాబాద్ ఫామ్‌హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ నమోదైన కేసుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణకుప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని బీజేపీ కోరింది. 8 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సైబారాబాద్‌ సీపీ, రాజేంద్రనగర్‌ ఏసీపీ, మొయినాబాద్‌ ఎస్‌హెచ్‌వో, కేంద్రం, సీబీఐని ప్రతివాదులుగా బీజేపీ చేర్చింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపై పిటిషన్‌లో బీజేపీ  అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కోర్ట్ పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలని హైకోర్టును బీజేపీ కోరింది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. 


బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు- కిషన్ రెడ్డి 


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే వివాదంలో చిక్కుకోవడంతో బీజేపీ నేతలు వరుసగా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, టీఆర్ఎస్ పార్టీ నేతలు అంతా డ్రామా ఆడిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. పట్టుబడ్డ ముగ్గురిలో ఒకరైన నందకుమార్ అనే వ్యక్తి తనతోనే కాదని.. మంత్రి హరీష్ రావుతోను ఫోటో దిగారని అన్నారు. టీఆర్ఎస్‌ నుంచి ఎవరినైనా చేర్చుకోవాలంటే నేరుగా తామే మాట్లాడుకుంటామని, మధ్యవర్తులను పంపే అవసరం లేదని అన్నారు. పార్టీలో చేర్చుకునేందుకు తమకు ఓ కమిటీ ఉందని అన్నారు. నంద కుమార్ ను పంపించాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. టీఆర్ఎస్ నేతలతో నంద కుమార్ దిగిన ఫోటోలను మీడియా ముందు చూపిన కిషన్ రెడ్డి చూపించారు. కేటీఆర్ బీజేపీ నాయకుడితో మాట్లాడిన ఆడియోను కూడా కిషన్ రెడ్డి మీడియాకు చూపించారు. పార్టీ చేరికలపై ఈటల రాజేందర్ ఆయా పార్టీల నాయకులతో నేరుగా మాట్లాడతారని అన్నారు.